వివేకా హత్య కేసు: మరో ముగ్గురిని విచారించిన సిట్
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కడప పోలీసు శిక్షణ కేంద్రంలో ముగ్గురు అనుమానితులను విచారించింది.
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు ఛేదించేందుకు సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ముగ్గురు అనుమానితులను విచారించారు. పులివెందులకు చెందిన వైకాపా నాయకుడు, వై.ఎస్.కుటుంబానికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఇతన్ని గతంలో దాదాపు ఐదు రోజుల పాటు కడపలో విచారించారు. రక్తపు మరకలు తుడిచే సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అక్కడే ఉన్నట్లు, గతంలోనే పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 15న హత్య జరిగిన స్థలంలో ఎవరెవరు ఉన్నారు... ముందుగా వివేకా ఇంటికి ఎవరెవరు ఎలా వచ్చారనే విషయాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇతనితో పాటు తెదేపాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని కూడా విచారించారు. కాగా రెండు రోజుల పాటు సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రత్యేక దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి : "దాడికి దిగారు... తప్పని పరిస్థితుల్లో కాల్చి చంపారు"
TAGGED:
వివేకా హత్య కేసు వార్తలు