కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి వైకాపా అధిష్ఠానం వేగం పెంచింది. బద్వేలు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. ఫలితంగా ఆమె బద్వేలు నుంచి విజయవాడ బయల్దేరారు. డాక్టర్ సుధతో పాటు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ అవినాష్ రెడ్డి, ముఖ్య నేతలతో సీఎం జగన్ గురువారం సమావేశం కానున్నారు.
బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఏడు మండలాలకు బాధ్యులను అప్పగించే విధంగా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. మహిళా అభ్యర్థి కావడంతో ఆమె గెలుపు కోసం జిల్లా నేతలంతా కలిసికట్టుగా పని చేసి విజయం సాధించే విధంగా సీఎం సూచనలు చేసే వీలుందని పార్టీ వర్గాల సమాచారం.
ఎమ్మెల్యే మృతి.. ఉప ఎన్నిక అనివార్యం
బద్వేల్ శాసనసభ్యుడుగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్‌గా వెంకటసుబ్బయ్య కొంత కాలం సేవలందించారు. వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు.. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.