ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈసీజీ పేరుతో యువతిని వివస్త్రను చేసి.. ఫోన్ లో చిత్రీకరిస్తూ..

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగితో.. పరీక్షల పేరు చెప్పి హద్దులు మీరాడు.. ఈసీజీ తీస్తానంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు! గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపడితే.. కొత్త కోణాలు వెలుగు చూశాయి. అసలేం జరిగింది..?

photos during EcG... at guntur
ఈసీజీ పేరుతో యువతిని వివస్త్రను చేసి.. ఫోన్ లో చిత్రీకరిస్తూ..

By

Published : Nov 13, 2021, 12:54 PM IST

ఈసీజీ తీసే పేరుతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతగుంటూరుకు చెందిన 19 ఏళ్ల యువతికి కొద్దిరోజులుగా ఛాతి వద్ద నొప్పిగా అనిపిస్తోంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఈసీజీ పరీక్షలు చేయించుకు రావాలని చీటీ రాసి ఇచ్చారు. యువతి ఈసీజీ తీయించుకోవడానికి వెళ్లింది. ఆ విభాగంలో ఉన్న హరీష్‌ ఆమెతోపాటు వచ్చిన తల్లిదండ్రులను గది బయటకు పంపించాడు. యువతికి ఈసీజీ తీస్తానంటూ వస్త్రాలను తొలగించాలన్నాడు. అందుకు ఆమె అడ్డు చెప్పడంతో అలాగైతే ఈసీజీ సరిగా తీయలేం, ఛాతి లోపల సమస్య ఏమిటో రిపోర్టులో స్పష్టంగా రావాలంటే తప్పనిసరిగా వస్త్రాలు తీయాలంటూ ఒత్తిడి చేశాడు. ఇంకా చాలా మంది వేచి ఉన్నారు. త్వరగా తీయించుకుంటావా లేదా అంటూ హడావిడి చేసి ఆమె చేత బలవంతంగా వస్త్రాలన్నింటినీ తొలగించి వేయించాడు. కళ్లు మూసుకొని అక్కడ ఉన్న బల్లపై పడుకోవాలని చెప్పి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వాటిని తన చరవాణిలో చిత్రీకరిస్తుండగా కంగుతిన్న ఆమె అతన్ని ప్రతిఘటిస్తూ బల్లపై నుంచి పైకి లేచింది.

లోపలకు వెళ్లిన తమ కుమార్తె ఎంతసేపైనా ఇంకా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడ్డారు. ఇంతలో లోపల నుంచి ఆ యువతి ఏడ్చుకుంటూ బయటకు వచ్చి, జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది. కోపోద్రిక్తుడైన తండ్రి అతన్ని నిలదీయగా తాను అలా ప్రవర్తించలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అతడి చరవాణి ఇవ్వాలని అడిగితే ఎదురు తిరిగాడు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి జీజీహెచ్‌లోని అవుట్‌పోస్టు పోలీసులకు జరిగిన విషయం తెలిపారు. సమాచారం తెలుసుకున్న కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి ఘటనాస్థలికి వెళ్లి ప్రాథమిక విచారణ చేశారు. ఈసీజీ తీస్తానంటూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడంటూ బాధితురాలు, ఆమె తండ్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

విచారిస్తే.. వెలుగులోకి కొత్త కోణం..

ఈ విషయంపై విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈసీజీ తీయాల్సిన శంకర్‌ అనే ఉద్యోగి కొద్ది రోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన ఆరోగ్యశ్రీ కింద ఒప్పంద ఉద్యోగిగా ఐదారేళ్ల నుంచి పని చేస్తున్నారు. అనారోగ్యానికి గురవడంతో ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉన్నతాధికారులకు తెలియకుండా హరీష్‌ను ఎందుకు విధులకు ఆహ్వానించారని శంకర్‌ను అప్పటికప్పుడు ఆసుపత్రికి పిలిచి విచారించగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

హరీష్‌ ఎవరో తనకు తెలియదని, తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రిలోనే ఈసీజీ టెక్నీషియన్‌గా శిక్షణ పొందుతున్న విద్యార్థిని తాను విధుల్లో లేనప్పుడు ఈసీజీలు తీయాలని చెప్పానని.. ఆ విద్యార్థి హరీష్‌ను తీసుకొచ్చి ఈసీజీలు తీయిస్తున్నారని గుర్తించారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఎవరు విధుల్లో ఉంటున్నారు? ఎవరు ఉండటం లేదో తెలుసుకోవడానికి ఆర్‌ఎంవో, సీఎంవో, ఆసుపత్రి పాలనాధికారి, అడ్మినిస్ట్రేటర్‌, ఏడీ ఇలా అనేక మంది ఉంటారు. వీరంతా తరచూ రౌండ్లు తిరుగుతూ ఉద్యోగుల విధులను పర్యవేక్షిస్తూ ఉంటారు. వారి విధులు సక్రమంగా నిర్వహిస్తుంటే...ఉద్యోగులు కాని వారు ఆసుపత్రికి వస్తారా అనే ప్రశ్న అందరికీ కలుగుతోంది. ఈ ఘటనను బట్టి మొత్తంగా ఆసుపత్రిలో పాలనా వ్యవహారాలు గాడి తప్పాయని స్పష్టం అవుతోందని ఆసుపత్రికి వచ్చిన వారు అంటున్నారు. ఇలాంటి ఇంకెన్ని ఘటనలు జరిగి ఉన్నాయోనని ఆందోళన చెందుతున్నారు. యువతి గుర్తించి అరవడంతో ఈ విషయం బయటపడిందని, లేకపోతే ఇది వెలుగులోకి వచ్చేది కాదని పలువురు పేర్కొంటున్నారు.

ఇటీవల ఇదే ఆసుపత్రి వార్డులోకి వచ్చి ఓ అపరిచిత వ్యక్తి శిశువును అపహరించుకుపోయిన ఘటనపై పెద్ద దుమారం రేగింది. అయినా ఉన్నతాధికారులు అప్రమత్తం కాలేదనడానికి తాజాగా చోటుచేసుకున్న ఉదంతమే నిదర్శనం. కొందరు వార్డుబాయ్‌లు, ఆయాలు సైతం అనారోగ్యం తదితర కారణాలతో వారి తరపున, వారి కుటుంబీకులను విధులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి ప్రశ్నించగా...యువతిని ఫొటోలు తీసిన హరీష్‌ అనే యువకుడు ఆసుపత్రి ఉద్యోగి కాదని, విధి నిర్వహణలో ఉండాల్సిన శంకర్‌ లేడన్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన అతన్ని విధుల నుంచి తొలగించామని చెప్పారు. కొందరు ఆయాలు, వార్డుబాయ్‌లు వారి కుటుంబీకులను విధులకు తీసుకొస్తున్నట్లు ఫిర్యాదులు లేవని తెలిపారు. అలా ఎవరైనా పంపితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి : వైద్యురాలి మోసం..లబోదిబోమంటున్న మాజీ సైనికుడి కుటుంబం

ABOUT THE AUTHOR

...view details