తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా నేత జీవీ ఆంజనేయులు.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మండిపడ్డారు. దీనిపై ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై చేసిన ఆరోపణలపై కోటప్పకొండలో సత్య ప్రమాణానికి పిలుపునిచ్చినా.. ఎమ్మెల్యే రాలేదని తెలిపారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో త్రికోటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని జీవీ అన్నారు.
అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్..
కరోనా వైద్యం పేరుతో ఎమ్మెల్యే, వైద్యులు దోచుకుంటున్నారని జీవీ ఆరోపించారు. తప్పు చేయలేదని ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తమ ఫౌండేషన్ సేవల నిలిపివేతపై నోటీసులు ఇచ్చిన అధికారులపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్న జీవీ.. వైకాపా చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు బొల్లా బ్రహ్మనాయుడు ముందుకు రావాలన్నారు.