గుంటూరు జిల్లా తెనాలిలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి దృశ్యా... ఏపీ టిడ్కో గృహాలను కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700 మందికి పైగా బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. బాధితులు కేర్ సెంటర్లలో చేరే సమయంలో ముందుగా పేరును నమోదు చేసుకునే సమయంలో.. ప్రతి ఒక్కరికీ వెల్కమ్ కిట్ తో పాటు మందుల కిట్టు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కేంద్రంలోని బాధితులకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చినట్లు సబ్ కలెక్టర్ మయూరి అశోక్ స్పష్టం చేశారు.
సేవలపై రోగులను అడిగి తెలుసుకుని..
కానీ.. అధికారుల సమన్వయ లోపం వల్ల సకాలంలో బాధితులకు సేవలు అందించలేక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ నుంచి కోసుకుంటున్న వారిని ప్రతిరోజు డాక్టర్లు పరామర్శిస్తున్నారా? లేదా ? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని రూములకు డాక్టర్లు వెళ్లడం లేదని తెలియడంతో వారిపై అసహనం వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించినప్పటికీ.. రోగులకు మెరుగైన సేవలు అందించలేక పోవడంపై అధికారులను ప్రశ్నించారు.
మున్సిపల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు..
కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్లలో పని చేయడానికి కేటాయించిన మున్సిపల్ సిబ్బంది అక్కడ విధులు నిర్వహించడానికి వెళ్లకపోవడంపై సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావును ఆరా తీశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఆయన అత్యవసర పరిస్థితుల్లో కూడా విధులకు హాజరుకాని ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.