గుంటూరులో దళిత యువతి రమ్య దారుణ హత్య కేసులో నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జీ డీఐజీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామన్న డీఐజీ... నరసరావుపేట మండలం ములకలూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. శశికృష్ణను పట్టుకునే క్రమంలో నిందితుడు తనను తాను గాయపరుచుకున్నట్లు డీఐజీ తెలిపారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో రమ్య, శశికృష్ణకు 6 నెలలుగా పరిచయం ఉంది. తనను ప్రేమించాలంటూ శశికృష్ణ వేధించేవాడు. రెండు నెలలుగా రమ్యపై వేధింపులు పెరగడంతో... శశికృష్ణతో ఆమె మాట్లాడటం మానేసింది. ప్రేమించకపోతే చంపుతానని రమ్యను పలుమార్లు బెదిరించాడు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) గొడవపడి రమ్యను శశికృష్ణ నరికి చంపాడు.
- ఇన్ఛార్జీ డీఐజీ రాజశేఖర్ బాబు
గుంటూరులో యువతి హత్య కేసు వివరాలు సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం...
పట్టపగలు అందరూ చూస్తుండగా.. విచక్షణారహితంగా దళిత యువతి రమ్యను హత్య చేసిన ఘటనలో విస్తుపోయే విషయాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో రమ్యతో పరిచయం పెంచుకున్న నిందితుడు శశికృష్ణ తన ప్రేమను తరచూ వ్యక్తం చేశాడు. తనపై రమ్యకు ఆసక్తి ఉందా..? లేదా.. ? అనే విషయాన్ని విస్మరించాడు. రమ్య తన ప్రేమను నిరాకరిస్తే ఎంతకైనా తెగించాలని మానసికంగా నిర్ధారణకు వచ్చి జనసమర్థం ఉన్న ప్రాంతంలోనే రమ్యపై విచక్షణారహితంగా కసితీరా కత్తితో ఆరుపోట్లు పొడిచాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గుంటూరు పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.
రమ్యపై శశికృష్ణ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు ఇన్‌ఛార్జి డీఐజీ రాజశేఖర్ బాబు తెలిపారు. గమనించిన స్థానికులు... బాధితురాలిని జీజీహెచ్‌కు తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో చనిపోయినట్లు వెల్లడించారు. రమ్య మృతదేహంపై ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావంతో ఈ ఘటన జరిగిందన్న డీఐజీ... వాటి ప్రభావం యువతపై అధికంగా ఉందన్నారు. మహిళలపై వేధింపులు ఎక్కువైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. రమ్య హత్య కేసును రాజకీయం చేయడం తగగదని ఇన్ఛార్జీ డీఐజీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
అనుబంధ కథనం