నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాలపై ప్రభుత్వం విధిస్తున్న ఛార్జీలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. 200 గజాల పైబడిన స్థలంలో నిర్మాణం చేపడితే స్థలం రిజిస్ట్రేషన్ ధరపై 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు నగరపాలక, పురపాలక ప్రణాళికా విభాగం అధికారులు. ఆ ఛార్జీలు చెల్లించకపోతే నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక మంజూరయ్యే అవకాశమే లేదు.
నగరవాసులకు పెను భారమైన 'ఓపెన్ స్పేస్' ఛార్జీలు
నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు... ఖాళీస్థలాలపై పన్ను అవరోధంగా మారింది. 200 గజాలు దాటాక ఇళ్లు కట్టుకుందామన్నా.. ఏదైనా నిర్మాణం చేపడదామన్నా... లక్షల రూపాయల్లో 'ఓపెన్ స్పేస్' ఛార్జీలు గుదిబండగా మారాయి. రాజధాని ప్రాంతం గుంటూరు వంటి ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను చూస్తూ ఉండటం తప్ప.. నిర్మాణానికి పనికి రావడం లేదు.
1985కి ముందు పన్నువేసి ఉండకపోయినా... ఆ నిర్మాణానికి గతంలో ప్లాన్ పొంది ఉండకపోయినా... ఖాళీస్థలానికి 14 శాతం పన్ను కట్టాల్సిందే. ఆఖరికి వారసత్వంగా వచ్చిన ఖాళీ స్థలమైనా భారం తప్పదు. గుంటూరులోని మిర్చియార్డు చుట్టుపక్కల చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు శీతల గిడ్డంగులు, కారంమిల్లులు ఏర్పాటు చేసుకుందామన్నా పన్ను భారం మోయలేక విరమించుకుంటున్నారు.
జాతీయ రహదారి వెంబడి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో గత మూడేళ్లలో రెండు, మూడు శీతల గిడ్డంగులు మించి... కొత్తవి నిర్మాణం జరగలేదు. ఇక్కడ ఎకరా ధర రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 3 కోట్ల 20 లక్షలు ఉంటుంది. దీనిపై 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు.. అంటే ఏకంగా 48 లక్షలకుపైగా కట్టాల్సిందే. కారం మిల్లుల నిర్మాణం 30, 40 లక్షల్లో పూర్తవుతుంది. ఈ లెక్కన అసలు కన్నా పన్నులే ఎక్కువైతే ఎలా నిర్మాణాలు చేపట్టగలమని నిర్మాణదారులు ప్రశ్నిస్తున్నారు.
ఖాళీ స్థలాలపై నగరపాలక, పురపాలక సంస్థలు విధిస్తున్న అపరిమిత పన్ను.... నిర్మాణరంగంపై పెను ప్రభావం చూపే అవకాశముందని నిపుణులంటున్నారు. నగర, పట్టణ శివార్లలో అభివృద్ధి మందగించే ప్రమాదముందని వారిస్తున్నారు.
TAGGED:
open space tax at guntur