Guntur Channel: ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లే ప్రధాన కాలువ గుంటూరు ఛానెల్. 47 కిలోమీటర్ల పొడవున సాగే ఈ కాలువ ద్వారా గుంటూరు నగరంతోపాటు చుట్టుపక్కల 36 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందుతుంది. ఎంతో కీలకమైన ఈ కాలువ కొన్నేళ్లుగా కాలుష్య కారకంగా మారింది. గుంటూరుతోపాటు ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని సహా వివిధ ప్రాంతాల నుంచి మురుగునీరు కలవడం వల్ల గుంటూరు ఛానెల్ కలుషితమవుతోంది. అలాంటి నీటిని శుద్ధి చేయకుండా చెరువుల్లో నింపి, గ్రామాలకు సరఫరా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
మురుగునీరు కాలువ దాటి వెళ్లేందుకు దశాబ్దాల క్రితమే గుంటూరు ఛానెల్‌పై చప్టాలు నిర్మించారు. ఇవి పగిలిపోయి మురుగునీరంతా కాలువల్లో కలుస్తోంది. మంగళగిరి, తక్కెళ్లపాడు వద్ద కాంక్రీట్ నిర్మాణాలు పగిలిపోయి... అక్కడి నుంచి మురుగునీరు గుంటూరు ఛానల్లోకి వెళ్తోంది. ముఖ్యంగా అనంతవరప్పాడు, లేమల్లెపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేసే క్రమంలో ఫిల్టర్ పాయింట్ల ద్వారా శుద్ధి చేసినా... రసాయన అవశేషాలు మాత్రం వేరుపడటం లేదు. ఈ నీరు తాగాలంటే భయపడుతున్న జనం.... వాటర్ ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు.