ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటేయలేదని మెట్లు కూల్చివేత... గుంటూరు జిల్లాలో ఘటన - elections in Guntur district

వైకాపా అభ్యర్థికి ఓటు వేయలేదన్న కారణంతో ఓ బిల్డర్‌ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంపులను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెం పంచాయతీలో సోమవారం ఇది చర్చనీయాంశమైంది.

Officials demolished stairs and ramp in Guntur district for not voting
ఓటేయలేదని మెట్లు కూల్చివేత

By

Published : Feb 16, 2021, 5:27 AM IST

Updated : Feb 16, 2021, 2:15 PM IST

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేష్‌ బిల్డర్‌. ఇళ్లు నిర్మించి విక్రయిస్తుంటాడు. ఇసప్పాలెంలో సరస్వతి శిశుమందిర్‌ సమీపంలో ఏడాది క్రితం 10 ఇళ్లు నిర్మించి అందులో కొన్ని విక్రయించాడు. ఒకదాంట్లో అతని కుటుంబం ఉంటోంది. రమేష్‌ తరఫు బంధువులు గోగులపాడు సర్పంచి ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుకు ఓట్లు వేశారని అధికార పార్టీ గ్రామనేతలు అతనిపై కక్షగట్టారు.

ఓ ప్రజాప్రతినిధితో మాట్లాడి.. పంచాయతీ సిబ్బంది, పోలీసులను రమేష్‌ నిర్మించిన ఇళ్ల వద్దకు పంపారు. ఆ సమయంలో అతను ఇంటి వద్దలేకపోవడంతో అత్తమామలు బొల్లు నాగేశ్వరరావు, చిన్నమ్మలు జేసీబీకి అడ్డుగా నిలిచారు. అన్ని అనుమతులు ఉన్నాయని ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. నాగేశ్వరరావు యంత్రాలకు అడ్డుగా పడుకున్నారు. పోలీసులు అతన్ని పక్కకు లాగేశారు. ఇళ్ల ముందున్న మెట్లు, ర్యాంపు, అరుగులను కూల్చివేశారు. కాసేపటికి వచ్చిన రమేష్‌.. అధికారులను ప్రశ్నించగా ఓ ప్రజాప్రతినిధితో మాట్లాడుకోవాలని జవాబిచ్చారు. వైకాపాకు ఓటు వేయాలని ఎన్నికల ముందు నుంచి ఒత్తిడి చేశారని వారికి అనుకూలంగా వ్యవహరించలేదని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు రమేష్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఓటేయలేదని మెట్లు కూల్చివేత

ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు బాధితులు స్పష్టం చేశారు. తాము సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తున్నా పట్టించుకోకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కూల్చివేతలు అడ్డుకున్నామని తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని వాపోయారు. జేసీబీని అడ్డుకునే క్రమంలో తన తలకు గాయమైనట్లు బాధితుడు నాగేశ్వరరావు తెలిపారు.

ఇదీచదవండి. కేసుల మాఫీకే ప్రైవేటీకరణపై మౌనం : తెదేపా అధినేత చంద్రబాబు

Last Updated : Feb 16, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details