ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ప్రభావం.. పల్నాడు యంత్రాంగం అప్రమత్తం - guntur officials take actions to reduce corona effected situation

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీ నుంచి మాచర్లకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ కావడంపై ప్రజలు ఆందోళనకు గురవుతుండగా... ఆ ఇద్దరు ఎవరెవరిని కలిశారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నగరం మొత్తం రసాయనాలు చల్లుతున్నారు. పోలీసులు సరిహద్దు వద్ద రాకపోకలు నిలిపేశారు.

కరోనా ఎఫెక్ట్​.. అప్రమత్తమైన పల్నాడు యంత్రాంగం
కరోనా ఎఫెక్ట్​.. అప్రమత్తమైన పల్నాడు యంత్రాంగం

By

Published : Mar 30, 2020, 2:45 PM IST

పల్నాడులో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీకి వెళ్లి వచ్చిన మాచర్ల వాసులు 10 మంది బృందంలో ఆ ఇద్దరు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బృందంలో ఇద్దరికి అనారోగ్య సమస్యలు తలెత్తగా.. ముందు జాగ్రత్తగా గుంటూరు తీసుకెళ్లారు. వీరిని పరిశీలించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మాచర్ల వాసులు ఆందోళనకు గురయ్యారు. దిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఏడుగురు పట్టణంలోని ఒకే ప్రాంతానికి చెందిన వారు కాగా, మిగిలిన వారు మరో కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈనెల 13 నుంచి 18 వరకు దిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత బృందంలోని ఇద్దరు గుంటూరులో ఇటీవల జరిగిన విందులోనూ పాల్గొన్నారని.. మసీదులో ప్రార్థనలు చేయడమే కాక వారి స్నేహితులనూ కలిశారని సమాచారం. వారందరని గుర్తించి.. అందరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

అధికారుల పర్యవేక్షణలో...

రెండు కరోనా కేసుల నిర్ధరణ నేపథ్యంలో దిల్లీ వెళ్లి వచ్చిన బృందం మొత్తాన్ని అధికారులు గుంటూరుకు తరలించారు. వారందరి కుటుంబ సభ్యులను వైద్యుల పర్యవేక్షణలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఇరువురు పాజిటివ్ వ్యక్తుల నివాస ప్రాంతాల వద్ద హైఅలర్ట్​ ప్రకటించారు. గురజాల ఆర్డీఓ పార్థసారథి, డీఎస్పీ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో మాచర్ల ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి, కమిషనర్‌ గిరికుమార్‌, తహశీల్దార్‌ వెంకయ్య వైద్య బృందాలతో సహా పరిశీలించారు. పాజిటివ్‌గా భావిస్తున్న వ్యక్తి తండ్రి తాను పరీక్షలకు ససేమిరా అన్న కారణంగా.. కాసేపు హైడ్రామా నడిచింది. అధికారుల ఆదేశాల మేరకు అతనికి, అనుమానితులకు పరీక్షలు జరిపేందుకు గుంటూరుకు తీసుకెళ్లారు. మాచర్లలో బాధితులున్న ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆరోగ్య కార్యకర్తలు, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. పట్టణంలో హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

తీరంలో రాకపోకలు బంద్‌

జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన చీరాలలో కొవిడ్‌ - 19 కేసులు రెండు నమోదు కావడంపై బాపట్లలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గుంటూరు - ప్రకాశం జిల్లా సరిహద్దును పూర్తిగా మూసివేసి కేవలం నిత్యావసరాల వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన సీనియర్‌ వైద్యుడు... కరోనా బాధితురాలికి చీరాలలో తన సొంత క్లినిక్‌లో ఈనెల 23న చికిత్స చేశాడు. మహిళ జ్వరంతో రావడం వల్ల సాధారణ వైద్య పరీక్షలు చేశారు. జ్వరం, జలుబు పెరగిన కారణంగా.. ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. సదరు మహిళకు వైద్యం చేసిన వైద్యుడు శనివారం మధ్యాహ్నం వరకు బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వహించారు. కరోనా కేసు వెలుగులోకి రాగా... ముందు జాగ్రత్త చర్యగా తన కుటుంబంతో కలిసి చీరాలలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వైద్యుడు వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కరోనా అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. వైద్యశాల ఐసోలేషన్‌ వార్డు బాధ్యుడిగానూ పని చేశారు. ఈ నేపథ్యంలో.. బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలో ప్రజలు జ్వరంతో వస్తే చికిత్స చేయడానికి వైద్యులు, సిబ్బంది భయపడుతున్నారు.

ఇదీ చూడండి:

రెండో రోజు రేషన్​ షాపుల ముందు తగ్గని రద్దీ

ABOUT THE AUTHOR

...view details