ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుణం.. సైనైడ్‌తో కుక్కను చంపి.. తర్వాత భర్తపై ప్రయోగం - గుంటూరు జిల్లా క్రైమ్ వార్తలు

వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. పథకం ప్రకారం తన భర్తను హత్య చేయించింది. నగల తయారీకి వాడే సైనైడ్ ఉపయోగించి కడతేర్చింది. ఇందుకోసం హంతకులకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చింది.

cyanide-murder
cyanide-murder

By

Published : Nov 28, 2020, 2:25 PM IST

Updated : Nov 29, 2020, 7:51 AM IST

దారుణం.. సైనైడ్​తో భర్తను చంపించిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. అత్యంత దారుణంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఆమె.. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను సైనైడ్‌తో చంపించింది. ఈ హత్య కేసును ఛేదించిన తీరును గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ శనివారం మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 తాళ్లూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్య (42) గ్రామంలో హోటల్‌, పాల దుకాణం నడిపేవారు. ఈ నెల 4న గ్రామ శివారులో ఇద్దరు ఆగంతుకులు ఆయనను అడ్డగించి ముఖంపై విషపూరిత రసాయనాలు చల్లి, దాడికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బ్రహ్మయ్య సమీపంలోని బంధువుల ఇంటికి చేరారు. వారు ఆయనను ఆసుపత్రికి తరలించేలోగా రసాయనాల ప్రభావంతో మార్గమధ్యలోనే చనిపోయారు. ఈ కేసును తేల్చేందుకు పెదకూరపాడు పోలీసులు ఘటన జరిగిన రోజు రాత్రి 10 గంటల సమయంలో అక్కడి టవర్‌ లొకేషన్‌కు వచ్చిన ఫోన్‌ కాల్స్‌ జాబితా సేకరించారు. బ్రహ్మయ్య హత్యకు ముందు ఆయన భార్య సాయికుమారి ఫోన్‌ నుంచి అదే గ్రామానికి చెందిన యువకుడు అశోక్‌రెడ్డికి కాల్‌ వెళ్లినట్లు గుర్తించారు. అదే సమయంలో ఈ టవర్‌ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి ఫోన్లు వెళ్లాయి. ఆ కాల్స్‌ డేటాను బట్టి మరోసారి సాయికుమారిని విచారించగా అశోక్‌రెడ్డితో వివాహేతర సంబంధం బయటపడింది.


ముందు రెక్కీ.. అపై అమలు
బ్రహ్మయ్యను చంపించేందుకు మచిలీపట్నానికి చెందిన పవన్‌ కుమార్‌, షేక్‌ షరీఫ్‌లకు సాయికుమారి, అశోక్‌రెడ్డి రూ.10 లక్షల సుపారీ ఇవ్వజూపారు. కొంత అడ్వాన్స్‌గా చెల్లించారు. హత్య ప్రణాళికలో భాగంగా వీరు రోల్డుగోల్డు తయారీలో వాడే సైనైడ్‌ను బిస్కట్‌లో కలిపి ఓ కుక్కకు తినిపించారు. అది కొద్ది నిమిషాల్లోనే చనిపోయింది. ఆ తర్వాత బ్రహ్మయ్యను చంపడానికి ముందు రెక్కీ నిర్వహించారు. ఆ రోజు రాత్రి బ్రహ్మయ్యపై సైనైడ్‌ చల్లి పారిపోగా, ఆ ప్రభావంతో చనిపోయినట్లు తేల్చారు. డబ్బుకు ఆశపడి ఈ యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఈ నలుగురినీ శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

ఇదీ చదవండి:దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్‌ దాడి

Last Updated : Nov 29, 2020, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details