కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఎగుమతిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) భవనంలో భారతీయ ఎగుమతి సంఘం సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్)తో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'ఎగుమతిదారులకు అండగా ఉంటాం' - ఏపీలో ఎగుమతిదారులు
ఎగుమతిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. సరకు రవాణా విషయంలో ఇప్పటికే ప్రత్యేక అనుమతులు జారీచేయటంతో పాటు నిబంధనలు సడిలించిందని వెల్లడించారు.
అంతర్రాష్ట సరకు రవాణా సరఫరా విషయంలో సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిందిగా ఎగుమతి దారులు కోరారు. సరకు రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక అనుమతులు జారీచేయటంతో పాటు నిబంధనలు సడిలించిందని రజత్ భార్గవ్ తెలిపారు. సరకు రవాణా విషయంలో ఇంకేమైనా సమస్యలు తలెత్తితే తక్షణమే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో రెడ్జోన్లో ఉన్న పరిశ్రమల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.