ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు పశ్చిమగోదావరి (ఏలూరు డివిజన్) జిల్లా అటవీ శాఖ అధికారి యశోదబాయ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమెకు రెండు నెలల సాధారణ జైలుశిక్ష, 2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లింపులో విఫలమైతే మరోవారం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఆమె అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగు వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ఈనెల 10 న ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ఇదీ జరిగింది..
పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో కలప, టేకు రవాణా కోసం ఈ ఏడాది జనవరి 12న అధికారులు ప్రకటన ఇచ్చారు. ఏలూరుకు చెందిన శరత్ రెడ్డి టెండర్లో పాల్గొని తక్కువ బిడ్ చేశారు. ఆ ఫైనాన్సియల్ బిడ్ తెరవకుండా.. అటవీ అధికారులు సొంత మనుషులతో పనులు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై శరత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పనులు చేపట్టవద్దని ఫిబ్రవరి 15న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులకు కట్టుబడి ఉండకపోవడంతో పిటీషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. డీఎఫ్‌వో అఫిడవిట్ దాఖలు చేస్తూ .. పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా టెండర్‌ను ఖరారు చేయలేదని.. అత్యవసర నేపథ్యంలో టేకు రవాణా పనుల్ని వనసంరక్షణ సమితి ద్వారా నిర్వహించామని పేర్కొన్నారు. ఆ వివరాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. 4వ సారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాక దాన్ని రద్దు చేయకుండా అదే పనిని వన సంరక్షణ సమితికి అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల నుంచి తప్పించుకోవడానికి మూడో పక్షం ద్వారా పనులు నిర్వహించారని స్పష్టంచేశారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు డీఎఫ్‌వో యశోదబాయ్కి రెండు నెలల సాధారణ జైలుశిక్ష, 2 వేలు జరిమానా విధించారు. తీర్పు అమలును నిలుపుదల చేశారు.