హైదరాబాద్ శివార్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చేరారు. తోడుగా వచ్చిన ఇద్దరు మహిళలు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా ఆసుపత్రి వార్డుబాయ్.. మంచంపై స్పృహలో లేని మహిళా రోగిని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించటం(women harassment) ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన సహాయకులు గమనించి కేకలు వేయటంతో స్థానికులు ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేశారు.
పాతబస్తీకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఆమె చరవాణికి అశ్లీల చిత్రాలు(Blue films) వచ్చాయి. వాటిలో తానే ఉండటంతో వణికిపోయింది. విషయం తెలిసిన యువకుడు పెళ్లివద్దన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీటీమ్స్, సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. యువతిని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని కాబోయే వరుడే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపినట్టు నిర్ధారించారు.
ఈ తరహా ఘటనల్లో చిత్రీకరించిన దృశ్యాలను బూచిగా చూపుతూ లైంగిక వాంఛలు తీర్చమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వివిధ కారణాలతో బయటకు చెప్పేందుకు మహిళలు వెనుకంజ వేస్తుండటంతో వారి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందరికీ తెలిసి పోతుందన్న ఉద్దేశంతో కేసులు వద్దంటూ రాజీ పడుతున్నారు.