ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను నిబంధన 154 ప్రకారం తన విచక్షణాధికారం మేరకు సెలక్టు కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు శాసన మండలి ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ వెల్లడించారు. సెలక్టు కమిటీ నిర్ణయం వచ్చేంత వరకు వేచి ఉండకుండా తమ నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తే ఆర్డినెన్సు జారీ చేయవచ్చు. ఆర్డినెన్సు జారీ చేయడానికి ముందు చట్టసభల్ని ప్రొరోగ్ చేయాలి. ఆ తర్వాత గవర్నరు ఆమోదంతో ఆర్డినెన్సు జారీ చేయాలి. అది ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. ఆ లోగా మళ్లీ చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. లేకపోతే 6 నెలల తర్వాత మళ్లీ ఆర్డినెన్సు గడువును పొడిగించవచ్చు. లేదా మొత్తంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయమూ తీసుకోవచ్చు. మండలిని రద్దు చేయాలంటే ఆ మేరకు కేంద్రాన్ని కోరుతూ మంత్రి మండలి తీర్మానం చేయాలి. శాసనసభ ఆమోదంతో కేంద్రానికి పంపించాలి. కేంద్రం ఆమోదిస్తే పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేస్తుంది. ఈ ప్రక్రియంతా ముగిసే సరికి కనీసం ఏడాది సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మూడు రాజధానుల విషయంలో వైకాపాకు ఉన్న మార్గాలివే! - వికేంద్రీకరణ బిల్లు
మూడు రాజధానుల నిర్ణయంపై మొండిగా ముందుకెళ్తున్న అధికార పక్షానికి శాసన మండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు బిల్లులనూ సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ ప్రకటించారు. అనూహ్యంగా రెండు బిల్లులకూ చుక్కెదురయిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఎలా ముందుకెళ్లబోతుంది? ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అన్నది ఉత్కంఠగా మారింది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపించాలని మండలి ఛైర్మన్ నిర్ణయించటంతో ఇప్పుడు కమిటీ ఛైర్మన్‌ను, సభ్యుల్ని నియమించటంతో పాటు, కాలపరిమితి, విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది. కమిటీ ఛైర్మన్‌గా సంబంధిత మంత్రి ఉంటారు. కమిటీలో 15 మంది వరకు మండలి సభ్యులుంటారు. కమిటీ నివేదిక అందజేయడానికి కనీసం 3 నెలల సమయం తీసుకోవచ్చని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అవసరమైతే మరింత పొడిగించుకునే అవకాశమూ ఉంటుందన్నారు.
ఇదీ చదవండి:సెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు