పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) చరిత్రలో ఇదో కీలకఘట్టం. గోదావరి(Godavari) సహజ ప్రవాహమార్గానికి ఎగువ కాఫర్ డ్యాంతో అడ్డుకట్ట వేసి నదీమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్ ఛానల్‌ను కొంతమేర తవ్వి స్పిల్ వే మీదుగా నీటిని మళ్లించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) స్పిల్ వే రివర్స్ స్లూయిస్ గేట్లు పదింటి ద్వారా తొలిసారిగా దిగువకు నీటిని వదిలిపెట్టారు. గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాలకు తొలిసారి ఇలా నీళ్లు వదిలారు. అంతకుముందు రెండేళ్లు స్పిల్ వే మీదుగా గోదావరి ప్రవాహాలు సాగినా కాఫర్ డ్యాంలో రెండుచోట్ల వదిలిన నది సహజమార్గాల మీదుగా కూడా ప్రవాహాలు మళ్లించారు. పూర్తిగా నదికి అడ్డుకట్ట నిర్మించి అప్రోచ్ ఛానల్ మీదుగా పోలవరం రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా నీరు ఇవ్వడం ఇదే తొలిసారి. ఏ ప్రాజెక్టులోనైనా నది ప్రవాహమార్గంలోనే స్పిల్ వే నిర్మిస్తారు. పోలవరం వద్ద గోదావరి తీరు వల్ల, ఇక్కడి భూభౌతిక పరిస్థితుల వల్ల స్పిల్ వే నిర్మించడం అసాధ్యమని ఎప్పుడో తేల్చారు. అందువల్ల గోదావరి నదీమార్గాన్ని మళ్లించాలని ప్రణాళిక రచించారు. దాన్ని సాకారం చేసిన కీలక ఘట్టమిది. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన సింగన్నపల్లి వద్ద నుంచి నది తన మార్గం నుంచి మళ్లి.. తిరిగి పోలవరం దిగువన సహజ నదిలో కలిసేవరకూ 6.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలోనే అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ ఉంటాయి. అప్రోచ్ ఛానల్ ఇంకా పూర్తిస్థాయిలో తవ్వాలి. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం ఈ పనులు కొంత మేర చేసి నదిని మళ్లించారు.
సింగన్నపల్లి వద్ద పూజలు
పోలవరం(Polavaram) ఎగువన సింగన్నపల్లి వద్ద శుక్రవారం ఉదయం 12.15 గంటలకు జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పూజలు చేసి నది ప్రవాహమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్ ఛానల్(Approach Channel) వద్ద ఉన్న అడ్డుకట్టను తొలగించడంతో గోదారమ్మ మార్గం మార్చుకుని స్పిల్ వే వైపు పరుగులు తీసింది. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్(AnilKumar), వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని(Alla Nani) , జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.