వచ్చే విద్యా సంవత్సరం(2021-2022) పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టే పరిస్థితి వచ్చే వరకు ఆన్‌లైన్ పాఠాలను మరింత పకడ్బందీగా కొనసాగించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. గత ఏడాది అనుభవాలు, లోటుపాట్లను సరిదిద్దుకొని మెరుగ్గా ఆన్‌లైన్ విద్యను ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. గత విద్యా సంవత్సరం(2020-21) సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ విద్యను ప్రారంభించారు.
కరోనా సద్దుమణిగి ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టొచ్చని ఎదురుచూస్తూ చివరకు ఇక లాభం లేదని ఆలస్యంగా డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. ఈసారి ప్రత్యక్ష తరగతులకోసం ఎదురుచూడకుండా ఆన్‌లైన్ పాఠాలను జూన్ నెలాఖరు లేదా జులై నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. గత ఏడాది తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 3-10 తరగతులకు కలిపి దాదాపు 2 వేల ఆన్‌లైన్ పాఠాలను పాఠశాల విద్యాశాఖలోని రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్) రూపొందించింది. వాటిని టీవీల ద్వారా ప్రసారం చేశారు. సిలబస్‌లో 30 శాతం తగ్గించినందున వాటికి సంబంధించిన అంశాలపై మరో 700 వరకు పాఠాలను రికార్డు చేయాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.
కేంద్రం ఏం చెప్పిందంటే...
ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశమై కొవిడ్ కాలంలో ఆన్‌లైన్ విద్యను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రాలు ఆన్‌లైన్ విద్యను అందించేందుకు సొంతగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పిల్లల్లో విద్యా అభ్యసనాల అంచనాకు కొత్త విధానాలు తయారుచేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉన్నందున జూన్ మొదటి వారంలో విద్యాశాఖ విద్యా క్యాలెండర్‌పై చర్చించనుంది.