ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రవాణాశాఖలో స్మార్టు కార్డులకు చెల్లు - transport department decided to stop smart cards news

వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), డ్రైవింగ్‌ లైసెన్సు (డీఎల్‌) కోసం మళ్లీ ప్లాస్టిక్‌ కార్డులను ఇచ్చేందుకు రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకూ జారీ చేస్తున్న స్మార్టు కార్డులను ఇకపై నిలిపేయనున్నారు.

రవాణాశాఖలో స్మార్టు కార్డులకు చెల్లు
రవాణాశాఖలో స్మార్టు కార్డులకు చెల్లు

By

Published : May 30, 2022, 5:45 AM IST

వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), డ్రైవింగ్‌ లైసెన్సు (డీఎల్‌) కోసం రవాణాశాఖ ఇప్పటివరకూ జారీ చేస్తున్న స్మార్టు కార్డులను ఇకపై నిలిపేయనున్నారు. మళ్లీ ప్లాస్టిక్‌ కార్డులను ఇచ్చేందుకు రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్మార్టు కార్డుల జారీలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. చిప్‌తో కూడిన ఆర్సీ, డీఎల్‌ కోసం వాహనదారుడి నుంచి రూ.200 ఫీజుగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల నుంచి స్మార్టు కార్డులు సకాలంలో జారీ కావడం లేదు. వాహనం కొన్న అయిదారు నెలలకుగానీ ఆర్సీ అందటం లేదు. డ్రైవింగ్‌ లైసెన్సులదీ ఇదే పరిస్థితి. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలనే తనిఖీల సమయంలో చూపించాల్సి వస్తోంది.

ఇకపై ఈ ఇబ్బందులు లేకుండా ప్లాస్టిక్‌ కార్డులు ఇవ్వనున్నారు. రవాణాశాఖ ఏరోజుకారోజే ఆర్సీ, డీఎల్‌లను ప్లాస్టిక్‌ కార్డులపై క్యూఆర్‌ కోడ్‌తో సహా ముద్రించి, అదేరోజు పోస్టులో పంపేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ప్లాస్టిక్‌ కార్డులు, ప్రతి రవాణాశాఖ కార్యాలయానికి ఒకటి చొప్పున ప్రింటరు కొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అధికారుల తనిఖీ సమయంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే కార్డు అసలుదా.. నకిలీదా అన్న విషయం తెలిసిపోతుంది. ఈ ప్లాస్టిక్‌ కార్డు ఖరీదు, ముద్రణ, పోస్టల్‌ ఖర్చు కలిపి రూ.30-40 వరకే అవుతుంది. ప్లాస్టిక్‌ కార్డుల జారీ తొలుత విజయవాడలోని జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) కార్యాలయ పరిధిలో ఒకటి, రెండు వారాల్లో అమలు చేయనున్నట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తామని పేర్కొంటున్నారు. గతంలో 2002 నుంచి 2009 వరకు ప్లాస్టిక్‌ కార్డులే ఇచ్చేవారు. ఇప్పుడు మళ్లీ అవే రానున్నాయి.

ఇవీ చూడండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details