Tourist Visa Problems: ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారి శాంతించింది.. విదేశాలు ఆంక్షలు సడలించాయి.. విమానాలు అన్ని దేశాలనూ చుట్టివస్తున్నాయి.. రెండున్నరేళ్లపాటు ఇతర దేశాలకు వెళ్లలేని వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. విదేశీ అందాలు చూసొద్దాం అంటూ పర్యాటకులు సిద్ధం అవుతున్నారు. ఏ నెలలో వెళ్లాలి.. ఏయే దేశాలు చూసిరావాలి.. బడ్జెట్ ఎంతవుతుంది.. ఇలా లెక్కలేసుకుని పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక షాక్ తగులుతోంది.
Tourist Visa Problems in Telangana : గతంలో ఏ దేశానికైనా ఒకట్రెండు వారాల్లో పర్యాటక వీసా దొరికేది. కానీ, ఇప్పుడు యూరప్ దేశాలకు వెళ్లాలంటే కనీసం నెల, రెండు నెలలు ఆగాల్సివస్తోంది. అమెరికాకు గరిష్ఠంగా 500, న్యూజిలాండ్‌కు 200 రోజులు పడుతోంది. ఫలితంగా సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం వైపు చూస్తున్నారు. అమెరికా, యూరప్‌లకు వెళ్లాలనుకునేవారు ప్రస్తుతానికి ఉత్తర, ఈశాన్య భారత్‌లోని పర్యాటక ప్రాంతాల వైపు దృష్టిసారిస్తున్నారు.
*హైదరాబాద్ వాసి రవీంద్రనాథ్ విహారయాత్రకు కుటుంబంతో పాటు గ్రీస్ వెళ్లాలనుకున్నాడు. పర్యాటక వీసా కోసం ప్రయత్నిస్తే నెల, నెలన్నర సమయం పడుతుందన్నారు. ఆయన యాత్రను రద్దు చేసుకున్నారు.
*కాంచనలక్ష్మి కుటుంబం అప్పుడప్పుడు సరదాగా సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి వస్తుంటుంది. ఈసారి థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంది. విమాన టికెట్లు, హోటల్ గదుల ధరలు ఎక్కువగా ఉండటంతో బడ్జెట్ భారీగా అవుతోంది. టూర్ ఆపరేటర్‌ను అడిగితే రెండు, మూడు నెలల తర్వాత ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చాడు.
విమానఛార్జీలు డబుల్:
విదేశాలతో పాటు దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విమాన టికెట్ల ధరలు కొవిడ్ ముందుకంటే రెట్టింపు అయ్యాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. హోటళ్లలో గదుల అద్దెలూ పెరిగాయి. కొవిడ్ సమయంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవడం ఒక కారణం అయితే.. పర్యాటకుల తాకిడి హఠాత్తుగా పెరగడమూ మరో కారణమని అంటున్నారు. బ్యాంకాక్‌కు గతంలో రానుపోను విమాన టికెట్లు రూ.18-20వేలకు దొరికేవి. ఇప్పుడు రూ.40వేల వరకు ఖర్చవుతోంది. సిక్కింకు విమాన టికెట్ రూ.4వేలకు దొరికేది. అదీ రెట్టింపైంది.