నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. కీలక అంశాలపై చర్చ వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. నూతన ఇసుక విధానంపై మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా కొత్త ఇసుక పాలసీని ఆమోదించే అవకాశం ఉంది. కొత్త ఇసుక విధానంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రజాభిప్రాయాలను సేకరించింది.
శాసనసభ సమావేశాల నిర్వహణ, ఆమోదించాల్సిన బిల్లులపైనా మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు. నవంబర్ 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. శాసనసభ నిర్వహణ తేదీపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
దిశ బిల్లులో సవరణ అంశాలు, అసైన్డ్ భూముల లీజుల బిల్లుపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. ఐపీసీ సెక్షన్లను మార్పు చేసే అంశంపై ఇటీవలే దిశ బిల్లును కేంద్రం తిప్పి పంపింది. రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై రూపొందించిన అంచనాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. దాదాపు 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలకు భూ కేటాయింపులపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. తదనుగుణంగా స్థలాలను కేటాయించనున్నట్టు సమాచారం. మచిలీపట్నం, కాకినాడ పోర్టు పనులపై చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై విధించిన సెస్, ప్రొఫెషనల్ టాక్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రవాణా పన్నుల పెంపు ప్రతిపాదనలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. కరవు భత్యం పెంపు