Power Usage: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సర్దుబాటుకు పరిశ్రమలకు విరామం ఇచ్చినా.. విద్యుత్ వినియోగం తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో డిస్కంలు జారీ చేసిన పరిమితులు, నియంత్రణ (ఆర్‌అండ్‌సీ) నిబంధనలను అతిక్రమించి విద్యుత్ వినియోగించే పరిశ్రమలకు సరఫరా నిలిపేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఉత్తర్వులు జారీ చేసింది. వారి నుంచి నిబంధనల మేరకు జరిమానా వసూలు చేయాలని, భవిష్యత్తులో మరోసారి నిబంధనలను ఉల్లంఘించబోమని హామీపత్రం తీసుకున్న తర్వాతే సరఫరా పునరుద్ధరించాలని పేర్కొంది.
రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆర్‌అండ్‌సీ నియంత్రణలు తొలగించే వరకు వాటికి విద్యుత్ సరఫరా ఇవ్వకూడదని డిస్కంలకు నిర్దేశించింది. పరిశ్రమలకు విద్యుత్ విరామం అమలుకు సంబంధించి ఆర్‌అండ్‌సీ నిబంధలను ఏపీఈఆర్‌సీ ప్రకటించింది. ‘ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి వినియోగించే విద్యుత్‌కే ఆర్‌అండ్‌సీ నిబంధనలు వర్తిస్తాయి. గ్రిడ్ భద్రత దృష్ట్యా డిస్కంలు జారీ చేసిన ఈ నిబంధనలను కొందరు పరిశ్రమల నిర్వాహకులు పాటించడం లేదు.
దీంతో రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) సూచన మేరకు గ్రిడ్ నియంత్రణకు అత్యవసర విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌అండ్‌సీ నిబంధనల అమలుపై డిస్కంలు దృష్టి సారించాలి. పారిశ్రామిక విద్యుత్ వినియోగంపై తనిఖీలు నిర్వహించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.