ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీఎస్​ఆర్టీసీలో కార్మిక సంఘాలుండవు... ఇక ఉద్యోగ సంఘాలే ! - ఏపీఎస్​ఆర్టీసీ

ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైంది. మూడు, నాలుగు రోజుల్లో నివేదిక ప్రభుత్వానికి అందనున్నట్లు సమాచారం. కార్మిక సంఘాలను తీసేసి..ఉద్యోగ సంఘాలుగా వాటిని మార్చనున్నట్లు తెలుస్తోంది.

ఏపీఎస్​ఆర్టీసీలో కార్మిక సంఘాలుండవు... ఇక ఉద్యోగ సంఘాలే !
ఏపీఎస్​ఆర్టీసీలో కార్మిక సంఘాలుండవు... ఇక ఉద్యోగ సంఘాలే !

By

Published : Dec 4, 2019, 6:19 AM IST

ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించిన నివేదిక దాదాపు సిద్ధమైంది. ఆదివారంలోపే ఈ నివేదికను ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నెల 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విలీనానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అనుకున్నట్టు జరిగితే జనవరి ఒకటిన విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఆరీస్టీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి, వారిని కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రజా రవాణాశాఖలో ఉద్యోగులుగా చూపనున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత జీతాలు తగ్గుతాయని, కొన్ని సదుపాయాలు కోల్పోయే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన ఉంది. అయితే జీతాలు తగ్గవని కీలక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న పోస్టులే ప్రజా రవాణాశాఖలో కూడా ఉంటాయని, ఇప్పుడు ఎంత జీతం పొందుతున్నారో, ప్రభుత్వంలో విలీనం తర్వాత కూడా అంతే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో వేతన సవరణ చేయనుండగా, అది ప్రజా రవాణాశాఖలో చేరే ఆర్టీసీ కార్మికులకు కూడా వర్తించడం ద్వారా జీతాలు పెరిగే వీలుంటుందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదించబోయే మరికొన్ని కీలకాంశాలు

  • విలీనం తర్వాత ప్రస్తుతమున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండవు. కేవలం ఉద్యోగుల సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వంలో విలీనం తర్వాత సమ్మె చేసేందుకు వీలుండదని అంటున్నారు. ఆర్టీసీలో ఉండే పారిశ్రామిక వివాద చట్టం(ఐడీఏ) ఉండదు.
  • ఈడీలు, రీజనల్‌ మేనేజర్లు వంటి ఎక్కువ జీతాలు పొందే ఉన్నతాధికారులకు కొన్ని అలవెన్స్‌లు తొలగిస్తారు. అలాగే వీరి మూల వేతనం (బేసిక్‌), ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతన పరిమితి కంటే అదనంగా ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని వ్యక్తిగత చెల్లింపు (పర్సనల్‌ పే- పీపీ)గా చూపిస్తారు. ఆ అదనపు మూల వేతనానికి డీఏ మాత్రం ఇవ్వరు.
  • ఆర్టీసీలో స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ (ఎస్‌ఆర్‌బీఎస్‌) ఉండగా, ప్రజా రవాణాశాఖలో అది ఉండదు. ప్రజా రవాణాశాఖలో చేరినప్పటి నుంచి భాగస్వామ్య పింఛన్‌ పథకం (సీపీఎస్‌) వర్తించనుంది. ఇంత కాలం ఆర్టీసీలో కార్మికులు ఈపీఎఫ్‌ చెల్లించిన నేపథ్యంలో, ఆకస్మికంగా ఆపేయడం వల్ల నష్టం కలగొచ్చని, దానిని కొనసాగించేలా చూడాలని అంతా కోరారు. ఆ విన్నపాన్ని కమిటీ పరిశీలిస్తోంది.
  • ఆర్టీసీలో పరిమితిలేని వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత రూ.3లక్షల పరిమితితో, ఆపై అయ్యే ఖర్చుకు ప్రత్యేక అనుమతితో రీయింబర్స్‌మెంట్‌ చేసే విధానం అమలు కానుంది. ఆర్టీసీ కార్మికుల వైద్య సేవల కోసం ప్రస్తుతమున్న డిస్పెన్సరీలు, విజయవాడలో ఆసుపత్రి కొనసాగుతాయి.

ABOUT THE AUTHOR

...view details