ఒకదాని తర్వాత.. ఒకదానికి మించి మరొకటి కరోనా వేవ్ వస్తూనే ఉంది. గతంలో వచ్చిన వారిపైన.. వ్యాక్సిన్ వేయించుకున్న వారిపైన కూడా ఈ మహమ్మారి తన ప్రభావం చూపుతోంది. అత్యధిక కేసులు నమోదు అవుతున్న సమయంలో నిర్ధరణ పరీక్షలు కూడా ప్రహసనంగా మారుతున్నాయి. తక్షణం పరీక్షించేందుకు ర్యాపిడ్ జన్ కిట్లు ఉన్నా వీటి ద్వారా అందరీలో సరైన ఫలితం రాబట్ట లేని దుస్థితి. దీంతో ఆర్టీపీసీఆర్ తప్పక చేపించాల్సిందే. ఈ ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాలి. ఈ సమస్యకు ఐఐటీ హైదరాబాద్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధకులు పరిష్కారాన్ని కనుగొన్నారు.
94.2 శాతం కచ్చితత్వం...
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడు శివ్ గోవింద్ సింగ్ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం కృత్రిమ మేథతో పనిచేసే కరోనా నిర్ధరణ పరికరాన్ని రూపొందించారు. దీని ద్వారా ఎవరికి వారు స్వయంగా ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు. ఈ పరికరానికికోవీహోం అని పేరు పెట్టారు.
గొంతు, ముక్కు నుంచి తీసిన స్రావాలను కిట్‌లోని ఎలక్ట్రానిక్ చిప్‌పై ఉంచి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ కిట్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించాలని, అందులోని ఐ-కొవిడ్ యాప్ ద్వారా 30 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ దీని పనితీరు పరిశీలించిందని, కరోనా నిర్ధారణలో కిట్ సామర్థ్యం 94.2 శాతం, నిర్దిష్టత 98.2 శాతం ఉన్నట్లు గుర్తించిందని వివరించారు. భారత వైద్య పరిశోధనా మండలి నుంచి తుది అనుమతులు రాగానే మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.
ఐఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్య శివ్‌గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ సూర్యస్నాత త్రిపాఠి, సుప్రజా పట్ట, స్వాతి మెహంతి దీని రూపకల్పనలో భాగస్వాములయ్యారు. కోవిహోమ్‌తో ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చని ఐఐటీ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి తెలిపారు. పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, ఈఎస్‌ఐసీ వైద్యకళాశాలకు చెందిన ఆచార్య శ్రీనివాస్, డాక్టర్ ఇమ్రాన్, డాక్టర్ స్వాతి, డాక్టర్ రాజీవ్ ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారని ఆచార్య శివ్‌గోవింద్ సింగ్ వివరించారు.