TELANGANA DEBT: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ప్రకారం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.53,970 కోట్లను రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
అయితే కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలనూ ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రం బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాలు ఈ ఏడాది రూ.34,970 కోట్లకు పరిమితం కానున్నాయి. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో జూన్ ఆఖరు వరకు రూ.7,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించి రుణం తీసుకోగా.. ఈ నెల నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.9,000 కోట్ల చొప్పున రూ.27,000 కోట్ల బాండ్లను విక్రయించనుంది.
బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మార్చి 31న రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కాకుండా అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలు భారీగా పెరుగుతుండటం, వాటిని బడ్జెట్‌ల నుంచి చెల్లిస్తుండటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాలను ఈ ఏడాది రాష్ట్రాలు తీసుకునే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నుంచి మినహాయించనున్నట్లు పేర్కొంది.
దీనిపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతిపాదించిన విధానం వివక్షాపూరితంగా ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకునే కార్పొరేషన్ రుణాలనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే పరిగణించాలని, గడచిన రెండేళ్లలో తీసుకున్న అప్పులను లెక్కలోకి తీసుకోవడం సరికాదని తెలిపింది. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. గత రెండేళ్లలో తెలంగాణ తీసుకున్న కార్పొరేషన్ల రుణాలు సుమారు రూ.57 వేల కోట్లు. వీటిని కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకు విభజించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకునే రుణాల్లో రూ.19 వేల కోట్లు తగ్గించింది.