కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు కేంద్రం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనుంది. పీఎం కేర్స్ చిల్డ్రన్స్ పథకం కింద ఈ సాయాన్ని ఇస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా చిన్నారుల బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేయనుంది. 18 ఏళ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ తరహా చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల సాయానికి ఇది అదనం.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాల నమోదుకు కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రాల జువైనల్ జస్టిస్ విభాగం అధికారులు ఇలాంటి చిన్నారుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేస్తారు. చిన్నారుల పేరుతో బ్యాంకు ఖాతా లేకపోతే ప్రత్యేక ఖాతా తెరవాల్సిన బాధ్యత జువైనల్ జస్టిస్ అధికారులదే. పోర్టల్‌లో చిన్నారుల వివరాల నమోదు తర్వాత సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్.. పోర్టల్‌లో తన ఆధార్ కార్డు నంబరుతో నమోదై సదరు వివరాలను ధ్రువీకరించి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. కలెక్టర్ తన ఆధార్‌కార్డు నంబరు మీద పోర్టల్‌లో నమోదై చిన్నారుల వివరాలను కేంద్రానికి నివేదిస్తారు. ఆ తర్వాత సాయం విడుదలవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ చిన్నారులు 223 మంది ఉన్నట్లు జువైనల్ జస్టిస్ అధికారులు గుర్తించారు. వీరిలో 205 మంది వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. అన్ని ఆధారాలతో బాధితుల వివరాలు ఎవరైనా పోర్టల్‌లో నమోదు చేసే అవకాశం ఉంది.