రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలలకు మొదటిసారిగా కన్వీనర్, యాజమాన్య కేటగిరీలుగా బోధనా రుసుములను నిర్ణయించనున్నారు. వైద్య విద్యలో అనుసరిస్తున్న విధానాన్నే ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు అమలు చేయాలని ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఒక నివేదికను రూపొందించి.. ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించనుంది.
కమిషన్ ప్రస్తావించిన అంశాలు...
- అండర్ గ్రాడ్యుయేషన్‌లో 25 శాతం కళాశాలలు నిర్ణీత ప్రమాణాలను పాటించనందున వీటికి రుసుముల నిర్ణయ అర్హత లేదు.
- కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, ఇతరత్రా నిబంధనల ఆధారంగా పాయింట్లు కేటాయించాలి. ఈ పాయింట్ల వారీగా రుసుములు చెల్లించాలి.
- కళాశాలలను నాలుగు కేటగిరీలుగా విభజించి.. ఇందులో 'సీ' కేటగిరీ వాటికి రుసుములను నిర్ణయించకుండా మూసేసుకోవాలని యాజమాన్యాలకు సూచించాలి.
- ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయటం సహా 75 శాతం హాజరు ఉంటేనే బోధన రుసుములు చెల్లించేలా నిబంధనలు తీసుకురావాల్సి ఉంది.
- ఎంసెట్, నీట్ అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే బోధన రుసుములకు అర్హులుగా నిర్ణయించాలి.
- బీఈడీ, ఎంఈడీ, నర్సింగ్‌లో అర్హత లేని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించటంతో పాటు తరగతుల నిర్వహణ లేకుండానే కొన్ని కళాశాలలు బోధన రుసుములను పొందుతున్నట్లు కమిషన్ వెల్లడించింది.
రుసుముల నిర్ణయం ఇలా...
- విద్యార్థిపై కళాశాల చేస్తున్న వ్యయాన్నే రుసుములకు ప్రామాణికంగా తీసుకోనున్నారు.
- మౌలిక సదుపాయాలు, పరిశోధన, అక్రిడిటేషన్, ప్రాంగణ నియామకాలు, బోధనార్హతలు, విద్యార్థి...అధ్యాపక నిష్పత్తి, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 500 పాయింట్లను కేటాయిస్తారు. వాటి ఆధారంగా రుసుములు నిర్ణయిస్తారు.
- కళాశాలలను ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. ఏ+, ఏ, బీ కేటగిరీ కళాశాలలకు రుసుములు నిర్ణయిస్తారు.
- సీ కేటగిరీ కళాశాలలకు రుసుములు నిర్ణయించకపోవచ్చు. వాటిలో చదువుతున్న విద్యార్థుల బోధన పూర్తయ్యే వరకు కొనసాగించడమా... సమీపంలోని మరో కళాశాలలో సర్దుబాటు చేయడమా అనేది నిర్ణయిస్తారు.