ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covaxin Export To 60 Countries: 60 దేశాలకు స్వదేశీ టీకా కొవాగ్జిన్‌ ఎగుమతి!

Covaxin export to 60 countries: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశీయ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకా 60 దేశాలకు ఎగుమతి కానుంది. టీకాను పెద్దఎత్తున ఎగుమతి చేయటానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సన్నాహాలు చేస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఎగుమతులు వేగవంతం చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు.

Covaxin export to 60 countries
Covaxin export to 60 countries

By

Published : Dec 29, 2021, 9:17 AM IST

Covaxin export to 60 countries:‘కొవాగ్జిన్‌’ టీకాను పెద్దఎత్తున ఎగుమతి చేయటానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సన్నాహాలు చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఈ సంస్థ ప్రధానంగా ఎగుమతులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీకాకు ఇప్పటికే పలు దేశాల్లో ‘అత్యవసర అనుమతి’ లభించిన విషయం విదితమే. ఇటీవల కాలంలో మరికొన్ని దేశాలు కూడా దీనికి అనుమతులు ఇచ్చాయి. దాదాపు 60 దేశాలకు ‘కొవాగ్జిన్‌’ను ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కంపెనీ వద్ద కొన్ని ఎగుమతి ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఎగుమతులు వేగవంతం చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు.

Covaxin gets WHO approval: మరోవైపు యూఎస్‌, కెనడా మార్కెట్లలో సైతం ‘కొవాగ్జిన్‌’ టీకాకు అనుమతి లభిస్తుందనే ఆశాభావంతో భారత్‌ బయోటెక్‌వర్గాలు ఉన్నాయి. అక్యుజెన్‌ ఇంక్‌ అనే యూఎస్‌ కంపెనీ భాగస్వామ్యంతో యూఎస్‌, కెనడాలో అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అదే జరిగితే ఆ దేశాల్లో అనుమతి పొందిన తొలి భారతీయ టీకా ఇదే అవుతుంది. ‘కొవాగ్జిన్‌’ టీకాకు వివిధ దేశాల నుంచి ఎగుమతి ఆర్డర్లు లభిస్తున్నందున, అందుకు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం హైదరాబాద్‌ సహా మరికొన్ని చోట్ల బీఎస్‌ఎల్‌-3 సౌకర్యాలతో కూడిన యూనిట్లను సిద్ధం చేశారు. కర్ణాటకలోని మాలూర్‌, గుజరాత్‌లోని అంకలేశ్వర్‌, మహారాష్ట్రలోని పుణెలో నెలకొల్పిన ఈ యూనిట్లలో ‘కొవాగ్జిన్‌’ టీకా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. తద్వారా ఏటా 100 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మనదేశంలో 12- 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా ఇవ్వటానికి అనుమతి లభించింది. దీనికి తగ్గట్లుగా టీకా అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

దేశీయంగానూ పెరగనున్న అవసరాలు

covaxin for children: మనదేశంలో ఇప్పటికే 60 శాతానికి పైగా కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి టీకాలు ఇవ్వటంతో పాటు రెండు డోసులూ పూర్తయినవారికి అవసరాన్ని బట్టి ‘బూస్టర్‌ డోసు’ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల కొత్త సంవత్సరంలో ‘కొవాగ్జిన్‌’ అవసరాలు దేశీయంగా కూడా అధికంగా ఉంటాయని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థ కొత్త సంవత్సరంలో చుక్కల టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌)ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీనిపై 3వ దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత తక్కువ సమయంలో పరీక్షలు పూర్తిచేసి అనుమతి కోరాలని కంపెనీ భావిస్తోంది. ఈ టీకాను భారీగా ఉత్పత్తి చేయటం, పంపిణీ కూడా సులువు. ‘బూస్టర్‌ డోసు’ కిందా దీన్ని వినియోగించవచ్చని భావిస్తున్నారు. అందువల్ల చుక్కల టీకాపై కంపెనీ అధికంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఏటా 100 కోట్ల డోసుల చుక్కల టీకా ఉత్పత్తి చేయటానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు భారత్‌ బయోటెక్‌ పలు ఇతర వ్యాధులకు టీకాలు ఆవిష్కరించే పనిలో ఉంది. ఇందులో కొన్ని వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రావచ్చు. గన్యా, కలరా, జికా, టైఫాయిడ్‌, రొటావైరస్‌ టీకాలు ఇందులో ఉన్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details