మార్చి నెలాఖరు వరకు తాగు, సాగు అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 83 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈమేరకు బోర్డుకు వివరాలు అందించింది. త్వరలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో నీటిఅవసరాల వివరాలు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. అందుకు అనుగుణంగా 83 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు సభ్యకార్యదర్శికి లేఖ రాశారు.
కల్వకుర్తి ఎత్తిపోతలకు 17.9 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 4.5 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టుకు 18, మిషన్ భగీరథకు 2.5, సాగర్ ఎడమ కాల్వకు 40 టీఎంసీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అటు 2020 డిసెంబర్ నెలాఖరు వరకు ఉమ్మడి జలాశయాల నుంచి 73.89 టీఎంసీలు వాడుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రెండు జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ 401.919 టీఎంసీల నీటిని వాడుకొందని పేర్కొంది. అటు మార్చి నెలాఖరు వరకు తమకు 108.50 టీఎంసీల నీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇప్పటికే లేఖ రాసింది.