ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Brijesh Kumar Tribunal: 'ఆ 150 టీఎంసీల నీటిలో 125 మాకే ఇవ్వాలి'

Brijesh Kumar Tribunal: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ క్యారీఓవర్‌ స్టోరేజి కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అనుమతించిన 150 టీఎంసీలలో తెలంగాణకు 125, ఆంధ్రప్రదేశ్‌కు 25 కేటాయించాలని తెలంగాణ కోరింది. నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు ఇదే నిష్పత్తిలో వినియోగం జరగాలని స్పష్టం చేసింది.

'ఆ 150 టీఎంసీల్లో 125 మాకే ఇవ్వాలి'
'ఆ 150 టీఎంసీల్లో 125 మాకే ఇవ్వాలి'

By

Published : Mar 6, 2022, 4:36 PM IST

Brijesh Kumar Tribunal: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ క్యారీఓవర్‌ స్టోరేజి కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అనుమతించిన 150 టీఎంసీలలో తెలంగాణకు 125, ఆంధ్రప్రదేశ్‌కు 25 కేటాయించాలని తెలంగాణ కోరింది. నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు ఇదే నిష్పత్తిలో వినియోగం జరగాలని స్పష్టం చేసింది. క్యారీఓవర్‌ స్టోరేజి అంటే ఈ సంవత్సరం చివరలో వచ్చిన నీటిని నిల్వ చేసుకొని తర్వాతి సంవత్సరం వాడుకోవడం. అలాగే నీటి వినియోగానికి సంబంధించిన ఆపరేషన్‌ ప్రొటోకాల్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లు సరిపోతాయని, జూరాల అవసరం లేదని తెలంగాణ పేర్కొంది. ఈ మేరకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో శనివారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. నీటి వినియోగం ఎలా ఉండాలో పేర్కొంటూ 6ప్రాధాన్యాలను సూచించింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగంపై విచారణ చేస్తోన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు కీలకమైన ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. తెలంగాణ తరఫున కేంద్రజలసంఘం మాజీ సభ్యుడు చేతన్‌ పండిట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

బేసిన్‌ అవతలకు 331 టీఎంసీలను మళ్లిస్తున్న ఏపీ

  • "తెలంగాణలో మొదటి ప్రాజెక్టు జూరాల కాగా.. దీని ద్వారా భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లు నీటిని తీసుకొంటాయి. పులిచింతల దిగువన 15కి.మీ. దాకా కేవలం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఉంటుంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలలో 369 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమవుతాయి. మిగిలిన 442 టీఎంసీలు పైరాష్ట్రాల నుంచి వస్తాయి. నీటి వినియోగానికి బేసిన్‌ పరిధిలో వినియోగించుకోవడం ప్రామాణికమైనా ఏపీ 331 టీఎంసీల నీటిని బేసిన్‌ అవతలకు మళ్లిస్తోంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పక్కబేసిన్‌కు మళ్లించడం న్యాయసమ్మతం కాదు.
  • శ్రీశైలం పొంగిపొర్లి నాగార్జునసాగర్‌ నిండిన తర్వాత అదనంగా వచ్చే నీటిని నిల్వ చేయనప్పుడు రెండు రాష్ట్రాలు ఏ ప్రాజెక్టు నుంచి అయినా వీలైనంత ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా మళ్లించే నీటిని బేసిన్‌లోనే వినియోగించుకోవాలని లేదు. అయితే రాష్ట్రం వాటాలో భాగంగానే చూడాలి. రాష్ట్రాలకు ఇచ్చే నీటిని ఖరారు చేశాక దీనిని ఎలా వినియోగించుకోవాలన్నది రాష్ట్రాల ఇష్టం. అయితే మొదట బేసిన్‌ కేటాయింపు తర్వాతనే పక్కబేసిన్‌కు మళ్లించాలి.
  • శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సమీకృత నిర్వహణ (ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌) ఉండాలి. ఈ 2ప్రాజెక్టుల కిందే కాకుండా ఉపనదులు, చిన్ననీటి వనరుల కింద వినియోగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
  • జూరాల ప్రధాన కృష్ణాపై ఉన్నా దీని నిల్వ సామర్థ్యం 5.95 టీఎంసీలు మాత్రమే. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రెండూ కలిసి 346.7 టీఎంసీలు. కాబట్టి జూరాల అవసరం లేదు. దీంతోపాటు తుంగభద్ర ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, కృష్ణాడెల్టా కూడా అవసరం లేదు.
  • 2002-03, 2003-04 తప్ప మిగిలిన ఏ సంవత్సరంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు లోటు లేదు. కేటాయింపులకు మించి వినియోగించుకొన్నారు.
  • నీటి వినియోగంలో నాగార్జునసాగర్‌ కింద బేసిన్‌లో అవసరాలు, చెన్నై తాగునీటి సరఫరా, శ్రీశైలం కింద బేసిన్‌ అవసరాలు, నాగార్జునసాగర్‌, శ్రీశైలం నింపడం, తర్వాత పక్కబేసిన్‌కు మళ్లించడం.. ఇలా 6ప్రాధాన్యాలు వరుస క్రమంలో ఉండాలి." అని అఫిడవిట్‌లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details