ఔటర్‌రింగ్ రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగాంగా అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతించాలని హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్‌ఆర్‌పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్టాగ్ చెల్లింపులకు అవకాశం ఉండనుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్‌ఎండీఏ సూచించింది. కర్ఫ్యూ అమలులో ఉన్న వేళల్లో ఓఆర్‌ఆర్‌పై కార్లను అనుమతించడం జరగదని అధికారులు స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే.. స్థానిక పీఎస్‌కు సమాచారం అందించాలని హెచ్‌ఎండీఏ అధికారులు ఆదేశించారు.