ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2019, 6:28 AM IST

Updated : Nov 21, 2019, 6:41 AM IST

ETV Bharat / city

ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వేచి చూసే ధోరణితో ఉంది. సమ్మె విరమించేందుకు సిద్ధమన్న ఐకాస ప్రకటన, ఇతర పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాకే.. ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకునే వాతావరణాన్ని కల్పిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఐకాస... హైకోర్టు తీర్పును ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం గౌరవిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. ఐకాస ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ఉత్పన్నమైన పరిణామాలు, ఐకాస ప్రకటన సహా అన్ని అంశాలను నిశితంగా గమనిస్తోంది.

రెండుసార్లు అవకాశం..

కార్మికులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ.. సర్కారు గతంలోనే రెండుసార్లు అవకాశం కల్పించింది. ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరాలని... విధుల్లో చేరే వారు మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా ఉంటారని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిపై తక్కువ సంఖ్యలో మాత్రమే సానుకూలంగా స్పందించారు.

స్పందిస్తారా...?

ఐకాస కోరిన విధంగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందిస్తాయా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. ఆర్టీసీలో యూనియన్ల ప్రస్తావనే ఉండరాదని, వాటి నుంచి సంస్థకు విముక్తి లభించాలని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు స్పష్టం చేశారు. కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని సూచించారు. కార్మికశాఖ తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతివ్వాలని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తేలుస్తుందని హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ సర్కారు స్పష్టం చేసింది.

ఎలాంటి నిర్ణయం...?

వీటన్నింటి నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంది. బుధవారం సాయంత్రం ఐకాస ప్రకటన తర్వాత ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఇవీ చూడండి:

సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

Last Updated : Nov 21, 2019, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details