తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. నిన్న రోగికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ తీశారు. దాదాపుగా కరోనా అనే అనుమానంతో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడికి రాగానే ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల చనిపోయాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూడటానికి సైతం రాకపోవడం మానవత్వానికి మచ్చగా నిలిచింది. శనివారం రాత్రి నుంచి మృతదేహాం మార్చురీలోనే ఉంది. ఈ ఘటనతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఆదివారం రాత్రి 8.30 గంటలకు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మృతి చెందిన తర్వాత అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడానికి వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు రాలేదు.