రైతు మనుగడను చరిత్రలో కలిపివేసే ప్రయత్నం జరుగుతోందంటూ.. నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగుదేశం(telugudesham) రోడ్డెక్కి ఆందోళనలు చేయనుంది. 25 పార్లమెంట్ స్థానాలను 5 జోన్లుగా విభజించి రోజుకో జోన్ పరిధిలో నిరసనలు తెలిపేలా ప్రణాళిక రూపొందించింది. 5 పార్లమెంట్ స్థానాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఇవాళ రాయలసీమ పరిధిలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిరసన తెలపనున్నారు. 15వ తేదీన కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరులో, 16న ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు చేపట్టనున్నారు. 17వ తేదీన అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో కాగా.. 18వ తేదీన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది.
సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, బి.సి.జనార్దన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులుకు ఒక్కో జోన్ బాధ్యతలు అప్పగించారు. నిరసన కార్యక్రమం తర్వాత తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి నేతలు వినతి పత్రం సమర్పించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మూత పడిందని.. రైతు సమస్యలపై ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు.
వైకాపా ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని తెలుగుదేశం నేతల ఆరోపిస్తున్నారు. వర్షాలు పుష్కలంగా కురిసినా సాగునీరు అందకపోవడం, పంట కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగింపు లేకపోవడం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు, విత్తనాలు, ఎరువులపై రాయితీలు నిలిచిపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. బీమా, పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీలు ప్రశ్నార్థకంగా మారాయని... ఇలాంటి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు.