సీతానగరం అత్యాచార ఘటన నిందితుల్ని వైకాపా నేతలు కాపాడుతున్నారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. నిందితులు వైకాపాకి చెందిన వారు కావటంతో కేసును నీరుగార్చుతున్నారని విమర్శించారు. వీరికి ఎమ్మెల్యేలు ఆళ్లరామకృష్ణారెడ్డి, వసంతకృష్ణప్రసాద్ల అండ ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కే ఇంట్లో సోదాలు చేస్తే నిందితుల సమాచారం దొరుకుతుందని చెప్పారు.
బాధితురాలికి న్యాయం చేసి నిందితుల్ని శిక్షించకుంటే మహిళలంతా కలిసి సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని అనిత హెచ్చరించారు. జగన్ రెడ్డి తెచ్చిన దిశ చట్టంలో నిబద్ధత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 520 మంది మహిళలు అత్యాచారలు, దాడులకు గురైతే ఒక్కరికీ న్యాయం జరగలేదని విమర్శించారు. దాడులు, అఘాయిత్యాలు.. మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ కు చీమకుట్టినట్లుగా కూడా లేవని ఆక్షేపించారు. దిశ చట్టం ద్వారా నిందితులను శిక్షించామని హోంమంత్రి అసత్యాలు చెప్పటం సిగ్గుచేటన్నారు.