మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు, బలహీనవర్గాల కడుపుకొట్టడానికే ముఖ్యమంత్రి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా నిరుద్యోగులతో మాంసం అమ్మించబోతున్నారని మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదివినవారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి.. చివరకు వారికి మాంసం దుకాణాల్లో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BUDHA VENKANNA: విజయసాయిరెడ్డి సలహాతోనే మటన్ మార్ట్‌లు: బుద్దా వెంకన్న - బుద్దా వెంకన్న తాజా వార్తలు
నిరుద్యోగులతో మాంసం అమ్మించాలని వైకాపా ప్రభుత్వం చూస్తుందని బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. డిగ్రీలు, పీజీలు చేసినవారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం జగన్ అని ధ్వజమెత్తారు.
గతంలో ఇసుక అమ్మకాల పేరుతో 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిన జగన్... ఇప్పుడు మాంసం విక్రయాల పేరుతో లక్షల మందికి తిండి లేకుండా చేయబోతున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాంసం అమ్మడం మొదలెడితే.. చెప్పిన ధరకే వినియోగదారుడు కొనాలని.. లేకపోతే బెదిరించైనా సరే మాంసాన్ని ప్రజలకు అంటగడతారని ఎద్దేవా చేశారు. విజయ సాయిరెడ్డి సలహాతోనే జగన్మోహన్ రెడ్డి మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండటానికే పనికొస్తాయి తప్ప.. ప్రజలకు మేలు చేయవని మండిపడ్డారు. మాంసం అమ్మకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు, బలహీనవర్గాల వారితో కలిసి సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఈ నెల 14 నుంచి 'రైతు కోసం తెలుగుదేశం'