TCONG on Munugode bypoll and Rahul tour: మునుగోడు ఉప ఎన్నికలను అన్ని పార్టీలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో మూడు ప్రధాన పార్టీలు చావో రేవో తేల్చుకునేందుకు సిద్దపడుతున్నాయి. భాజపా, తెరాసలు ఇంఛార్జిలను నియమించి ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముందే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించి మండలాలకు, క్లస్టర్లకు, బూతుల వారీగా ఇంఛార్జిలను నియమించి ఇంటింటి ప్రచారం ఇప్పటికే చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
రెండు రోజుల కిందట మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అక్కడి ఇంఛార్జిలతో సమావేశమైన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలతో పాటు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పాల్గొని దిశానిర్దేశం చేశారు. దాదాపు 3 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో.. క్లస్టర్ల వారీగా, బూతుల వారీగా నియమించిన నాయకుల పని తీరుపై ఆరా తీశారు. ఎవరెవురు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు.. ఎవరెవరు తిరగలేదు తదితర వివరాలను దగ్గర పెట్టుకుని సమీక్ష నిర్వహించారు.
సమయం కేటాయించలేని నాయకుల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా అయిదారు నుంచి పది బూతులను ఒక క్లస్టర్‌గా చేసుకుని ఇంఛార్జిలను ఏర్పాటు చేశారు. వీరంతా క్షేత్రస్థాయిలో తిరిగి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి. ఈ నెల 9 నుంచి 14 వరకు నాయకులు అంతా క్షేత్రస్థాయిలో మకాం వేసి ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్ పత్రాలను అభ్యర్థి పాల్వాయి స్రవంతి వేయనుంది. ఆ తర్వాత 14న భారీ జనసమీకరణతో.. మరొకసారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.