తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పర్వాలు, కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో సుదర్శననారసింహ హోమం, నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నేడు ఏకాదశిని పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.
ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ప్రతి నెల శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సుమారు గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని... మొక్కులు చెల్లించుకుంటున్నారు.