వారంతా విధివంచితులు. అన్నం తినిపించడం, డైపర్లు వేయటం, యూరిన్ బ్యాగులు మార్చడం.. ఇలా వారికి నిత్యం సపర్యలు చేయాల్సిందే. యూరిన్ బ్యాగులు, బెడ్ సోర్సు డ్రెస్సింగ్‌కు రోజూ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎయిర్ పరుపులు వాడాలి. ఫిజియోథెరపీ చేయించాలి. నెలనెలా మందులు, వైద్యం కోసం దాదాపు రూ.8 వేల వరకు ఖర్చవుతోందని తెలంగాణలో బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. 1800 మందిలో సగం మందికైనా దివ్యాంగ పింఛను అందడం లేదు. సదరం ధ్రువీకరణ పత్రం జారీ కాకపోవడం ఇందుకు కారణం. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.
వాట్సప్ గ్రూపులతో ఏకమై..
వెన్నెముక ప్రమాద బాధితులు వాట్సప్ గ్రూపుల ద్వారా ఒక్కటయ్యారు. తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, వెన్నుపూస బాధిత వికలాంగుల పోరాట సమితి, స్పైనల్ ఇన్ఫర్మేషన్ గ్రూపు, స్ఫూర్తి దివ్యాంగుల సంఘం పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో తమ బాధలు, చికిత్సకు సంబంధించిన సమాచారం పంచుకుంటూనే సలహాలు, సూచనలు ఇచ్చుకుంటున్నారు.
వైద్యం కోసం ఆస్తి అమ్మినా..
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మరికల్ గ్రామానికి చెందిన సంధిగారి నరేశ్‌కి (31) ఏళ్లు. 16 ఏళ్ల వయసులో (2006లో) తండ్రితో కలిసి ఉపాధి కోసం మరికల్ నుంచి ఆటోలో వెళ్తుండగా జీపు ఢీకొట్టింది. ఆ ఘటనలో నరేశ్ వెన్నుపూస విరిగిపోయింది. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. తల్లిదండ్రులు నర్సింహులు, నర్సమ్మలు.. ఉన్న ఆస్తిని అమ్మి దాదాపు రూ.20 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా 15 ఏళ్లుగా సురేశ్ మంచానికే పరిమతమయ్యారు. దివ్యాంగ పింఛన్ రావడం లేదు. 60 ఏళ్ల తల్లి.. కుమారుడికి సపర్యలు చేస్తున్నారు.
తల్లి కోసం బడి మానేసిన కూతురు