ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2021, 6:54 AM IST

Updated : Jul 14, 2021, 7:14 AM IST

ETV Bharat / city

Cinema Halls : ఇప్పట్లో థియేటర్లు తెరవలేం.. తెరపై బొమ్మ వినాయక చవితి తర్వాతే!

కుటుంబమంతా కలిసి నెలలో ఒకసారో, రెండుసార్లో బయటకు వెళ్లి.. హాయిగా ఏ హోటల్లోనో భోజనం చేసి...సెకండ్‌ షో సినిమాకెళ్లి... విరామ సమయంలో పాప్‌కార్నో, సమోసాలో కొనుక్కు తిని...తృప్తిగా ఇంటికి చేరి నిద్రపోయిన రోజులు గుర్తున్నాయా...! సినిమాహాల్‌కి వెళ్లి సినిమా చూసి చాలా నెలలైంది కదూ..! కరోనా మహమ్మారి సామాన్యుడికి... సినిమా వినోదాన్నీ దూరం చేసింది..!

Cinemahalls
సినిమాహాల్స్

ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... సినిమా హాళ్లు తెరవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇప్పటికిప్పుడు సినిమా ప్రదర్శనలు ప్రారంభించేందుకు థియేటర్ల యజమానులు సిద్ధంగా లేరు. విడుదలకు సిద్ధంగా తగినన్ని సినిమాలు లేకపోవడంతో పాటు, కరోనా వల్ల సగం సీట్లలో మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలన్న నిబంధన అమల్లో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన టికెట్‌ ధరలపై థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉండటం దీనికి కారణాలు. ముఖ్యంగా పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించడం తమకు సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగి థియేటర్లు తెరవడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని, వినాయక చవితి తర్వాతే ప్రదర్శనలు ప్రారంభం కావచ్చని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

‘ఓవర్సీస్‌’ కూడా చూసుకుని..!

కరోనా దెబ్బకు 2020 మార్చి 23న థియేటర్లు మూతపడ్డాయి. మొదటిదశ ఉద్ధృతి తగ్గి... లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేశాక, సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా విడుదలకు సినిమాలు సిద్ధంగా లేకపోవడంతో థియేటర్లు తెరుచుకోలేదు. 10-15 శాతం థియేటర్లు డిసెంబరులోను, మిగతావాటిని 2021 జనవరి 10న తెరిచారు. రెండోదశ ఉద్ధృతితో మళ్లీ ఏప్రిల్‌ 23 నుంచి థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘లవ్‌స్టోరీ’ వంటి కొన్ని సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నా, వాటి నిర్మాతలు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అన్ని షోలకూ ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉండటంతో మూడు షోలకే అనుమతి ఉంది. తెలుగు సినిమాకు ప్రస్తుతం ఓవర్సీస్‌ మార్కెట్‌ కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మొత్తం అన్ని షోలూ ప్రదర్శించేందుకు అనుమతులు వచ్చి, విదేశాల్లోను పరిస్థితులు మెరుగుపడి థియేటర్లు తెరుచుకుంటే సినిమాల విడుదలకు నిర్మాతలు ముందుకు వస్తారని ఒక ఎగ్జిబిటర్‌ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని సినిమా హాళ్లల్లో కేటగిరీల వారీగా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 8న జీవో జారీ చేసింది. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లకు నిర్ణయించిన టికెట్‌ ధరలు మరీ తక్కువగా ఉన్నాయని ఎగ్జిబిటర్లు అభ్యంతరం చెబుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్‌ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి టికెట్‌ ధరలపై ఒక స్పష్టత వచ్చాకే, థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ‘సుమారు ఏడాదిపాటు థియేటర్లు తెరుచుకోలేదు. అయినా ఆస్తిపన్ను, కనీస కరెంటు ఛార్జీలూ చెల్లించక తప్పదు. ఎన్నాళ్లుగానో మాతో పనిచేస్తున్న సిబ్బందిని ఇప్పుడు కష్టం వచ్చిందని పంపేయలేం. వారికి ఎంతో కొంత జీతం ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్‌ ధరలు కూడా తగ్గిస్తే నడపడం కష్టం’ అని కాకినాడకు చెందిన ఎగ్జిబిటర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండీ..CM Jagan: 'పల్లెలు శుభ్రంగా ఉంటేనే..ప్రజలకు ఆరోగ్యం'

Last Updated : Jul 14, 2021, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details