గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన కీలక విధానాలపై దర్యాప్తు జరిపించేందుకు వైకాపా సర్కారు మరో అడుగు వేసింది. ఏపీ నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత ప్రభుత్వ ముఖ్యమైన విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సంస్థలు,ముఖ్యమైన పాలనా అనుమతుల్ని సమీక్షించేందుకు..గతంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా... అది నివేదిక ఇచ్చింది. ఉపసంఘం తన నివేదికలో పొందుపరిచిన అంశాలపై ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో మొత్తం పది మంది పోలీసు అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో రఘురామ్‌రెడ్డి సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత విధాన, న్యాయ, ఆర్థికపరమైన అవకతవకలు అనేకం జరిగాయని.. సీఆర్డీఏ పరిధిలో భూములు సహా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రివర్గ ఉపసంఘం... తన నివేదికలో పేర్కొంది. ఉపసంఘం తన నివేదికలోని మొదటి భాగాన్ని ప్రభుత్వానికి అందజేసింది. నివేదికపై క్షుణ్నంగా చర్చించి, ఆమోదించిన తర్వాత ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నివేదికపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చ జరిగింది. ఆ అంశంపై క్రమబద్ధమైన, సమగ్ర దర్యాప్తు జరిపించాలని శాసనసభాపతి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ నేపథ్యంలో అన్ని అంశాల్నీ నిశితంగా పరిశీలించాక సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.