శరీరానికి వయసు ఉంటుంది గానీ.. మనసుకు ఉంటుందా? ఫీలింగ్స్‌కు ఉంటుందా..?? ఉండదుకదా.. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే.. మన స్టోరీలో దొంగ 50ఏళ్లు దాటేసినవాడు మరి! సమాజానికి భయపడో.. అవగాహన పెరగడం ద్వారానో.. "చేయకూడని" పనులు చేయాలన్న కోరికను నిగ్రహించుకుంటారు చాలా మంది. కొందరు మాత్రం తమకు పరిధులు లేవని బాహాటంగా ప్రకటించుకోవడం ద్వారా.. సెల్ఫ్ లైసెన్స్ ఇచ్చేసుకుంటారు. ఇవి రెండూ చేయలేని మూడోరకం బ్యాచ్ ఉంటుంది. కోరికలను అనుచుకోలేరు.. అలాగని తమ వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకోనూ లేరు.. ఇలాంటి వారంతా రాంగ్ రూట్లో వెళ్లి దెబ్బైపోతుంటారు. ఈ రకానికి చెందిన అదోరకపు మనిషే.. యోషిడో యోడా. ఈ పేరు క్యాచీగా లేకపోతే.. "రెయిన్ కోట్ మ్యాన్" అని గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాండ్ నేమ్‌తోనే ఇతగాడు జపాన్‌లో ఫేమస్.
దశాబ్ద కాలానికి పైగా రెయిన్ కోట్లు చోరీ చేస్తున్న యోడా.. చాలా కాలం పాటు న్యూస్ పేపర్ బాయ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతని వయసు 51 సంవత్సరాలు. మరి, అతనికి ఎలాంటి ఆలోచనలు వచ్చాయో.. ఏవిధమైన ఫీలింగ్స్ అనుభవించాడో తెలియదుగానీ.. ఆడవాళ్ల రెయిన్కోట్లు చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా.. 2009లో మొదటి సారిగా ఓ రెయిన్ జాకెట్ కొట్టేయాలని ప్లాన్ వేశాడు. టాస్క్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత మరొకదాన్ని చోరీ చేశాడు.. ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక, అప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిచోటా ఎత్తుకెళ్లడం మొదలు పెట్టాడు.
అందమైన ఆడవాళ్లు కనిపించగానే.. వారిని ఫాలో అవుతాడు. ఏళ్లతరబడి సైకిల్ మీద వెళ్లి, పేపర్ వేసిన అనుభవం ఉంది. దాంతో.. ఎంత దూరమైనా సైకిల్ మీదనే వారిని ఫాలో అవుతుంటాడు. వాళ్లు బైక్ మీదనో.. సైకిల్ మీదనో తమ రెయిన్ జాకెట్ పెట్టి.. ఏదో పనిమీద పక్కకు వెళ్లినప్పుడో.. ఇతరులతో మాటల్లో పడిపోయినప్పుడో.. చాకచక్యంగా లేపేసేవాడు. పొద్దున్నే జాగింగ్ చేసే మైదానాల వద్ద.. ఇతని చోరీలు ఎక్కువగా వర్కవుట్ అయ్యేవి.