యువ వైద్యురాలి హత్యపై ప్రజలు ఆగ్రహించారు. తెలంగాణలోని షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ గేటు వద్దకు దూసుకెళ్లిన ప్రజాసంఘాల నాయకులు, స్థానికులు.. భారీ స్థాయిలో ఆందోళన చేశారు. హత్యాచారం చేసిన వారికి కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో ఆ ప్రాంతాన్ని ఉద్రిక్తంగా మార్చారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. రహదారిపై బైఠాయించారు. నిరసనకు దిగారు.
అప్పగించండి... అంతు చూస్తాం
నిందితులను తమకు అప్పగించాలని ప్రజాసంఘాల నాయకులు గళమెత్తారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు దారి మళ్లించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని ఇవాళ షాద్‌నగర్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఇవాళ పరామర్శించారు.
కేసు వాదించబోం...
శంషాబాద్‌లో యువతి హత్యను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. నిందితుల తరఫున వాదించకూడదని నిర్ణయించాయి. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం చేయాలని తీర్మానించాయి. నిందితులకు బెయిల్ కోసం ఎవరూ సహకారం అందించకూడదని విజ్ఞప్తి చేశాయి.
నిరసనల వెల్లువ...
శంషాబాద్ హత్యోదంతంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యువతిని హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘ సేవ్ గర్ల్స్, సేవ్ సొసైటీ’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు శంషాబాద్‌లో పాఠశాల, కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి పోలీస్‌స్టేషన్ మీదుగా ర్యాలీ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిందితులకు వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు.