ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

THIRD WAVE: 'ఆగస్టు నుంచి రోజుకు గరిష్ఠంగా 1.40 లక్షల కేసులు రావచ్చు'

దేశంలో కరోనా మూడో దశ ప్రభావం ఉంటుందని, అది ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు కొనసాగుతుందని ఐఐటీ హైదరాబాద్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌, ఎలక్ట్రానిక్‌ విభాగాల ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ తెలిపారు. ఈ దశలో వైరస్‌ తీవ్రంగా ఉంటే గరిష్ఠంగా రోజుకు 1.40 లక్షల కేసులు రావచ్చన్నది తమ అంచనా అని పేర్కొన్నారు.

professor m vidyasagar
professor m vidyasagar

By

Published : Aug 5, 2021, 7:27 AM IST

ఆగస్టు నుంచి దేశంలో కరోనా ప్రభావం ఉంటుందని ప్రొఫెసర్​ ఎం. విద్యాసాగర్​ తెలిపారు. గత కొంతకాలంగా విద్యాసాగర్‌తో పాటు ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌, సైన్యంలో పని చేస్తున్న డాక్టర్‌ మాధురీ కనిట్కర్‌ కలిసి మ్యాథమెటికల్‌ విధానంలో కరోనా మీద విశ్లేషణ చేశారు. వీరు రెండో దశలో రోజుకు గరిష్ఠంగా 3.90 లక్షల కేసులు వస్తాయని అంచనా వేయగా.. నాలుగు లక్షల కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో దశ అవకాశాలపై బుధవారం విద్యాసాగర్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

మూడో దశ కరోనా వచ్చే అవకాశం ఉందా?

మా అంచనా ప్రకారం మూడో దశలో కరోనా కేసులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు ఉండే ఈ దశలో రోజుకు గరిష్ఠంగా 60 వేల నుంచి 70 వేల వరకు కేసులు ఉండొచ్చు. మొదటి రెండు దశల్లాగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని మా పరిశీలనలో తేలలేదు. డెల్టా కాకుండా కొత్త వేరియంట్‌ వచ్చి ప్రభావం చూపిస్తే మాత్రం ఈ సంఖ్య గరిష్ఠంగా 1.40 లక్షలకు పెరగొచ్చు.

మూడో దశలో కరోనా తీవ్రత ఎందుకు తక్కువగా ఉండే అవకాశం ఉంది?

మా పరిశీలనలో దేశవ్యాప్తంగా 90 కోట్ల మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు తేలింది. చిన్నారుల్లో కూడా యాంటీబాడీలు ఉన్నాయి. దీనివల్ల ప్రస్తుత డెల్టా వేరియంట్‌తో మూడో దశలో భారీ ఎత్తున వైరస్‌ సోకే అవకాశం లేదు.

ఆర్‌వాల్యూ ప్రభావం ఎలా ఉండబోతోంది?

ఆర్‌వాల్యూ ఒక శాతం కంటే తక్కువగా ఉంటే కరోనా వృద్ధి పెద్దగా ఉండదు. మొదటి, రెండో దశలో ఆర్‌వాల్యూ శాతం అధికంగా ఉండటం వల్లే కేసులు సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఆర్‌వాల్యూ 1.01 శాతం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 500 పైబడి కేసులు వస్తుంటే ఏపీలో 1500 వస్తున్నాయి. రెండో దశ ఈ రెండు రాష్ట్రాల్లో చాలా వరకు తగ్గింది. ఈ పరిస్థితిని విశ్లేషిస్తే మూడో దశ తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావించడం లేదు. అందువల్ల ఆక్సిజన్‌ కొరత సమస్య ఏర్పడే అవకాశం ఉండదని మా భావన.

మూడోసారి టీకా వేయించుకోవడం అవసరమా?

ఎంతమాత్రం అవసరం లేదు. ఏ కంపెనీ టీకా అయినా రెండు డోసులు వేయించుకున్న అందరిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి. ఇలా వచ్చిన యాంటీబాడీలు కనిష్ఠంగా ఎనిమిది నెలలపాటు ఉంటున్నాయి. అందువల్ల మూడో డోసు అవసరం లేదు.

డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో నష్టం అధికంగా ఉంటుందా?

డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లలో స్వల్పంగా మార్పు ఉంది. డెల్టా ప్లస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు.

ఇదీ చూడండి: కరోనా తీవ్రత తెలుసుకునేందుకు మురుగు నీటి పరీక్షలు!

ABOUT THE AUTHOR

...view details