ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అర్జంట్​.. ఆ అప్పులపై వివరాలివ్వండి..' రాష్ట్రానికి పీఏజీ లేఖ - ap updates

loan
loan

By

Published : May 14, 2022, 3:40 PM IST

Updated : May 15, 2022, 7:22 AM IST

15:37 May 14

అప్పులపై పూర్తి వివరాలు ఇవ్వాలని లేఖ

రాష్ట్ర అప్పుల లెక్కలు చెప్పలేక ప్రభుత్వం సతమతమవుతోంది. కార్పొరేషన్లకు గ్యారంటీలపై కాగ్‌ వివరాలు కోరుతూనే ఉన్నా.. వైకాపా సర్కారు ఇంకా పంపలేదు. వివరాల్ని అత్యవసరంగా ఈనెల 31లోగా పంపాలంటూ తాజాగా ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తాఖీదు పంపింది.

ఏయే కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం ఎంత రుణం తీసుకుంది ? కార్పొరేషన్లకు...ప్రభుత్వం ఏ రోజు ఎంత మొత్తానికి గ్యారంటీ ఇచ్చింది..? ప్రతి కార్పొరేషన్, ప్రభుత్వరంగ సంస్థ..ఆర్థిక సంస్థల వారీగా వివరాలేంటి ? జీవోలు ఎప్పుడు ఇచ్చారు ?. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం వివరాలు ఏంటి ? ఇవీ.. రాష్ట్రాన్ని కాగ్ అడిగిన ప్రశ్నలు. లెక్కకు మిక్కిలి అప్పులు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొత్తం అప్పుల వివరాలు తెలియజేయాలంటూ కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్- కాగ్‌(CAG) ఎప్పట్నుంచో కోరుతున్నా వెనకడుగు వేస్తోంది. జవాబు ఇంకా రాలేదంటూ కాగ్‌ అధికారులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తునే ఉన్నారు. స్పందించకపోవడంతో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌(PAG) కార్యాలయం రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు తాజాగా తాఖీదు పంపింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వరంగ సంస్థలకు, కార్పొరేషన్లకు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణ వివరాలన్నీ సమర్పించాలని కోరింది. ఇందుకు మే 31 వరకు గడువిచ్చింది. దీన్ని అత్యవసరంగా భావించాలంటూ పీఏజీ కార్యాలయ అధికారులు.. రాష్ట్ర అధికారులకు స్పష్టం చేశారు. మార్చి నెలాఖరుతోనే ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్‌ నాటికి కనీసం మే ప్రారంభం నాటికి ప్రభుత్వ లెక్కలను కాగ్‌ ఖరారు చేయాలి. కానీ.. వైకాపా ప్రభుత్వం అసలు సమాచారమే ఇవ్వలేదు. కాగ్‌కు మొత్తం వివరాలు చేరి, వారు ఇతరత్రా ప్రశ్నలు లేవనెత్తితే ఎదురయ్యే ఇబ్బందులపై ఆర్థికశాఖలో తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.

ప్రభుత్వ లెక్కలను ఖరారు చేసే క్రమంలో ఇప్పటివరకూ కాగ్‌ కేవలం బహిరంగ మార్కెట్‌ రుణాల వివరాలతోనే లెక్కలు తేలుస్తోంది. రాష్ట్రం చేస్తున్న అప్పుల తీరుతెన్నులపై కేంద్ర ఆర్థికశాఖకు, ప్రధానికి, ఆర్థికమంత్రికీ ఫిర్యాదులు చేరుతుండటంతో కాగ్‌ శైలి మార్చుకుంది. ప్రభుత్వం ఏ రూపంలో అప్పు చేసినా.. ఆ వివరాలన్నీ తెలియజేయాలంటూ గతేడాది డిసెంబరు నుంచి కోరుతూ వస్తోంది. ప్రతి నెలా రాష్ట్ర లెక్కలను కాగ్‌ పరిశీలించి..తుది అంకెలు తేలుస్తుంది. ఈ క్రమంలో జనవరి, ఫిబ్రవరిలో గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల వివరాలు కోరినా ప్రభుత్వం స్పందించలేదని కాగ్‌ వెల్లడించింది. ప్రభుత్వం బడ్జెట్‌ పుస్తకాల్లో వెల్లడించిన లెక్కల ప్రకారం ఇప్పటివరకూ లక్షా 69 వేల 905 వందల కోట్లరూపాయల అప్పుల కోసం వివిధ సంస్థలకు గ్యారంటీలు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు తిరిగి చెల్లించినవి పోనూ రూ. లక్షా 38వేల 603 కోట్లకు గ్యారంటీలు అమల్లో ఉన్నట్లు లెక్క.

స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం మరో 10వేలకోట్ల రూపాయలు సమీకరించింది. 65వేల కోట్ల వరకు నాన్‌ గ్యారంటీ రుణాలూ ఉన్నాయి. ఇందులో దాదాపు 50వేల కోట్ల విలువైన అప్పులను ఆయా సంస్థలే తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు లక్షా 63 వేల కోట్ల అప్పునకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కలన్నీ కాగ్‌కు సమర్పిస్తే మొత్తం అప్పుల విలువ అధికారికంగా పెరుగనుంది. కాగ్‌కు అసలు లెక్కలు పంపాకే తుది అప్పులు ఖరారు కానున్నాయి.

ఇదీ చదవండి:ఆ వివరాలు పంపాలి... రాష్ట్రాలకూ కేంద్ర వ్యయ విభాగం లేఖ

Last Updated : May 15, 2022, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details