తెలంగాణలో కడుపు కోతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతి రెండు నిమిషాలకు ఓ సీ సెక్షన్ జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించటం ఆందోళన కలిగించే విషయం. అనుకున్న ముహూర్తానికే బిడ్డను కనాలని కొందరు, నొప్పులు భరించలేమని మరికొందరు, ఇతరత్రా ఆరోగ్య కారణాలతో ఇంకొందరు... వెరసి ఇటీవలి కాలంలో గాటు పడితేకానీ కాన్పు కాని పరిస్థితి. తెలంగాణలో ప్రతి గంటకు 30మంది సిజేరియన్ ఆపరేషన్ల ద్వారానే జన్మిస్తున్నారని కేంద్రం పేర్కొంది. సీ సెక్షన్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ ఉన్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో రోజుకూ 740 సిజేరియన్లు జరిగినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
గణాంకాలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన శస్త్ర చికిత్సల గణాంకాలను కేంద్రం ఇటీవల వెల్లడించింది. మూడు నెలల్లో రాష్ట్రంలో 66,661 సిజేరియన్ కాన్పులు జరగగా.... అందులో ప్రభుత్వ దవాఖానాల్లో 30,560, ప్రైవేటు ఆస్పత్రుల్లో 36,101 జరిగాయి. ఈ మూడు నెలల గణాంకాల ఆధారంగా దేశంలోనే సీ సెక్షన్ల లో తెలంగాణలో మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక స్థాయిలో 85,323 సీసెక్షన్లు చేసి మహారాష్ట్ర మొదటి స్థానంలోనూ..... 78,982 శస్త్రచికిత్సలతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు పెంచేందుకు తెలంగాణ సర్కారు.... కేసీఆర్ కిట్ ని ప్రవేశపెట్టడంతో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినప్పటీ రాష్ట్రంలో కడుపు కోతలు మాత్రం తగ్గటం లేదు. గత మూడేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 1.25 నుంచి 1.30లక్షల సిజేరియన్లు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. ప్రైవేటులో 1.4౦ నుంచి 1.6౦లక్షల వరకు ఉంటుంది. 2018-19లో సీ సెక్షన్లలో ఆరో స్థానంలో ఉన్న తెలంగాణ ఏడాది కాలంలోనే మూడో స్థానానికి చేరటం ఆందోళన కలిగిస్తున్న విషయం.
పెరిగిన కడుపు కోతలు
భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2019-20కి సంబంధించి విడుదల చేసిన నివేదికల ప్రకారం గతేడాది తెలంగాణలో 2,84,954 సెక్షన్లు జరిగాయి. అగ్రస్థానంలో పశ్చిమ బెంగాల్ - 4,26,969, మహారాష్ట్ర - 4, 20,534, తమిళనాడు - 3,48,923, ఉత్తర ప్రదేశ్ - 3,00,868, కర్ణాటక - 2,88,329 రాష్ట్రాలు ఉన్నాయి. 2019లో ప్రతిగంటకి రాష్ట్రంలో 28 సీ సెక్షన్లు జరిగినట్టు నమోదు కాగా... ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇది కాస్తా 30కి పెరిగింది.
"దంపతులు, వారి తల్లిదండ్రులు తమ సంతానం మంచి రోజునో, మంచి నక్షత్రానో, లేదా ఫలానా రోజు పుట్టాలని... అలా జన్మిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. ఆ రోజు ఆ టైం రాగానే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి సిజేరియన్ చేయిస్తున్నారు. ఇక మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కనీసం సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయకుండానే సీ సెక్షన్లు చేసేస్తున్నారు. ఒక్క సర్జరీ చేస్తే రూ.50వేల నుంచి రూ.లక్షకు పైగా తీసుకునే ఆస్పత్రులు కోకొల్లలు. అదే సాధారణ డెలివరీ అయితే కాన్పు ఖర్చు అంతా కలిపినా 50వేల లోపే ఖర్చు అవుతుంది. సాధారణ కాన్పు కావాలంటే సుమారు 10 నుంచి 12గంటలపాటు నొప్పులు భరించాల్సి ఉంటుంది. నొప్పులు తట్టుకోలేమని మరికొందరు శస్త్రచికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. అనారోగ్య సమస్యలు, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు శస్త్రచికిత్సలు చేసి కాన్పు చేయటం సహజమే. అత్యధిక స్థాయిలో కాన్పులకు మాత్రం వ్యక్తుల విశ్వాసాలే కారణం."