ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sun Effect: అదరగొడుతున్న ఎండలు.. జాగ్రత్తలు ఎలా..! - precautions to be taken in summer

Precautions in Summer: ఆరంభంలోనే వేసవి అదరగొడుతోంది. ఉదయం నుంచే ఎండ దడ పుట్టిస్తోంది. ఏటేటా పెరిగిపోతున్న భూతాపం, మండిపోతున్న ఎండలకిదే నిదర్శనం. ఇవి మన ఆరోగ్యంపై విపరీత ప్రభావమే చూపుతున్నాయి. వేడి, వడగాలుల తాకిడికి ఎంతోమంది నిస్త్రాణ, వడదెబ్బ వంటి సమస్యలకు గురవుతున్నారు. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే. వృద్ధులకు, ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికివి ప్రాణాల మీదికీ తేవొచ్చు. ఈసారి భానుడి ప్రతాపం మరింత తీవ్రంగానూ ఉండొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.

weather
weather

By

Published : Mar 29, 2022, 10:03 AM IST

Precautions in Summer:శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. బయట చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా అవయవాలు సక్రమంగా పనిచేయటానికి అనువుగా లోపలి ఉష్ణోగ్రతను 98.6 డిగ్రీల ఫారన్‌హీట్‌కు అటూఇటూగా.. స్థిరంగా ఉంచుకుంటుంది. ఈ ప్రక్రియనంతా మెదడులోని హైపోథలమస్‌ నియంత్రిస్తుంది. దీన్ని ఒకరకంగా ఉష్ణ నియంత్రణ మీట(థర్మోస్టాట్‌) అనుకోవచ్చు. శరీరంలో ఎంత వేడి ఉత్పత్తి అవుతోంది? ఎంత వేడి బయటకు పోతోంది? అనే వాటినిది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఉష్ణోగ్రత ప్రభావానికి లోనయ్యే వెన్నుపాము, కండరాలు, రక్తనాళాలు, చర్మం, గ్రంథుల వంటి భాగాల నుంచి సంకేతాలను గ్రహిస్తుంది. అవసరానికి తగ్గట్టు స్పందించేలా వాటికి సంకేతాలనూ చేరవేస్తుంది.

ఉదాహరణకు: బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి. చర్మం వద్ద రక్తనాళాలు కుంచించుకు పోయేలా సందేశాలు పంపుతుంది. ఇలా ఉష్ణోగ్రత బయటకు వెళ్లకుండా చేస్తుంది. అదే బయట వేడిగా ఉంటే రక్తనాళాలు విప్పారాలని చెబుతుంది. అప్పుడు చర్మానికి రక్త ప్రసరణ పుంజుకుంటుంది. రక్తంతో పాటు ద్రవాలు, లవణాలు పెద్దమొత్తంలో చర్మానికి చేరుకుంటాయి. ఆ వెంటనే స్వేదగ్రంథులు ఉత్తేజితమై చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెమటకు బయటి గాలి తగిలి, ఆవిరయ్యే క్రమంలో శరీరం చల్లబడుతుంది. ఇది మంచిదే కానీ ఎండకాలంలో చెమట ఎక్కువగా పోయటమే చిక్కులకు కారణమవుతుంది. చెమటతో నీరు మాత్రమే కాదు, లవణాలు కూడా బయటకు పోతుంటాయి.

వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవటం ముఖ్యం. లేకపోతే ఒంట్లో నీటి శాతం, లవణాల మోతాదులు తగ్గిపోయి నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ వంటి సమస్యలు మొదలవుతాయి. నీరు మరీ తగ్గితే తీవ్రమైన వడదెబ్బకూ దారితీస్తుంది. వడదెబ్బలో ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం కుప్పకూలుతుంది. దీంతో ఉన్నట్టుండి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయి, ప్రాణాపాయమూ సంభవించొచ్చు. పిల్లలు, వృద్ధులు, ఎండను తట్టుకోలేనివారు, ఏసీ గదుల్లో గడిపేవారు, శారీరక శ్రమ అంతగా చేయనివారికి ఈ వేడి సమస్యల ముప్పు ఎక్కువ. కాబట్టి వీటి గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. మంచి విషయం ఏంటంటే- వీటిని నియంత్రించుకోవటం, నివారించుకోవటం మన చేతుల్లోనే ఉండటం.

కండరాలు పట్టేయటం:ఎండాకాలంలో తరచూ కండరాలు పట్టేస్తున్నాయంటే ఒంట్లో నీటిశాతం, లవణాల మోతాదులు తగ్గాయనే అర్థం. కణజాలం, కండరాలు పనిచేయటానికి సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలు అత్యవసరం. ఇవి కండరాల్లో రసాయన ప్రతిచర్యల్లో పాలు పంచుకుంటాయి. ఇలా కండరాలు సజావుగా పనిచేయటానికి తోడ్పడతాయి. వీటి మోతాదులు తగ్గిపోతే కండరాల పనితీరు అస్తవ్యస్తమై, గట్టిగా పట్టేసినట్టుగా బిగుసుకుపోవచ్చు. దీంతో విపరీతమైన నొప్పి తలెత్తుతుంది. కండరాలు పట్టేయటం పిక్కల్లో ఎక్కువ. కొందరిలో చేతులు, కడుపు భాగంలోనూ కండరాలు పట్టేయొచ్చు. కొన్నిసార్లు కాళ్లు, చేతులు కొంకర్లు పోవచ్చు కూడా. ఎండలో ఎక్కువసేపు గడపటం, నడవటం, వ్యాయామం, పనులు చేయటం వంటివి కండరాలు పట్టేయటానికి దారితీస్తుంటాయి. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు గలవారికీ దీని ముప్పు ఎక్కువే. రక్తపోటు తగ్గటానికి వేసుకునే కొన్ని మందులు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేయొచ్చు. దీంతో లవణాల మోతాదులూ తగ్గుతాయి. మధుమేహుల్లో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉండటమూ సమస్యకు దారితీయొచ్చు.

విశ్రాంతి ముఖ్యం:కండరాలు పట్టేసినప్పుడు చల్లటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. చల్లటి నీరు, పానీయాలు తాగాలి. నీటిలో కాస్త ఉప్పు, చక్కెర కలిపి తాగితే మంచిది. వీలుంటే ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపి తాగాలి. మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం కలిపి తాగినా మంచిదే. ఎండలో బయటకు వెళ్లటానికి ముందే తగినంత నీరు తాగి బయలుదేరితే నీటిశాతం తగ్గటాన్ని నివారించుకోవచ్చు. నీరు, ద్రవాలు తాగిన తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోయినా.. వికారం, వాంతులతో నీరు తాగలేకపోతున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వీరికి సెలైన్‌ ఎక్కించాల్సి రావొచ్చు. తలతిప్పు, నిస్సత్తువ, తలనొప్పి, తీవ్రమైన జ్వరం వంటివీ ఉంటే తగు చికిత్స అవసరమవుతుంది.

సొమ్మసిల్లటం:కొందరు ఎండలోకి వెళ్లినప్పుడు ఉన్నట్టుండి కాసేపు సొమ్మసిల్లి పోతుంటారు. దీన్నే హీట్‌ సింకోపీ అంటారు. దీనికి కారణం మెదడుకు తగినంత రక్తం అందకపోవటం. నీడ పట్టున, చల్లటి ప్రదేశంలో గడిపేవారికి.. వృద్ధులకు, రక్తపోటు తగ్గటానికి బీటా బ్లాకర్ల రకం మందులు వాడేవారికి, ఇతరత్రా సమస్యలు గలవారికి దీని ముప్పు ఎక్కువ. ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సాధారణంగా బయటి వాతావరణానికి అనుగుణంగా సన్నద్ధమవటానికి ప్రయత్నిస్తుంది. చెమట పట్టే క్రమంలో చర్మం వద్ద రక్తనాళాలు విప్పారి, చర్మానికి రక్త సరఫరా పెరుగుతుంది. అదే సమయంలో మిగతా అవయవాలకు.. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. ఇది సొమ్మసిల్లటానికి దారితీస్తుంది. తలతిప్పు, తలనొప్పి, నాడీ వేగం పడిపోవటం, చికాకు, వాంతి, వికారం వంటివీ ఉండొచ్చు. సొమ్మసిల్లటం తాత్కాలికమే అయినా జాగ్రత్త అవసరం.

పాదాల కింద ఎత్తు: ఎవరైనా ఎండలో సొమ్మసిల్లినట్టు గుర్తిస్తే వెంటనే నీడకు చేర్చాలి. పాదాల కింద ఎత్తు పెట్టి పడుకోబెట్టాలి. దుస్తులు వదులు చేయాలి. తెలివి రాగానే నీరు, ద్రవాలు తాగించాలి. రక్తపోటు బాగా తగ్గినా, మరీ నీరసంగా ఉన్నా ఆసుపత్రికి చేర్చాలి.

వేడి నిస్త్రాణ:ఎండ వేడికి తట్టుకోలేక కొందరు తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణకు లోనవుతుంటారు. దీన్నే హీట్‌ ఎగ్జాషన్‌ అంటారు. చుట్టుపక్కల వేడి గాలిని శరీరం తట్టుకోలేకపోతోందని, చల్లబడలేకపోతోందనటానికిది ఒక హెచ్చరిక. దీనికి కారణం శరీరాన్ని చల్లబరచటానికి విపరీతమైన చెమట పట్టటం. చెమటతో శరీరం చల్లబడుతుంది కానీ లవణాలు బాగా తగ్గిపోతాయి. రక్తపోటూ పడిపోతుంది. దీంతో దాహం వేయటం, కళ్లు తిరగటం, బలహీనత, ఏకాగ్రత కుదరకపోవటం, వికారం, మత్తుగా అనిపించటం వంటి లక్షణాలు మొదలవుతాయి. దీన్ని కొందరు వడదెబ్బగా పొరపడుతుంటారు. వడదెబ్బలో చెమట పట్టదు. ఇందులో చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత మామూలుగానే ఉంటుంది. తాకితే చర్మం చల్లగా అనిపిస్తుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. నాడి వేగం పెరగొచ్చు లేదూ మామూలుగానే ఉండొచ్చు.

నీరు ఎక్కువగా: నీరసంగా, బడలికగా అనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్లాలి. నీరు ఎక్కువగా తాగాలి. పరిస్థితి కుదుట పడ్డ వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బకు దారితీసే ప్రమాదముందని గుర్తించాలి.

వడదెబ్బ:ఎండ వేడిని తట్టుకోవటానికి చెమట పట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ద్రవం బాగా ఆవిరవ్వచ్చు. ఇదిలాగే కొనసాగితే ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం కుప్పకూలుతుంది. చివరికి చెమట పట్టటమూ ఆగిపోతుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగిపోతుంది. ఇదే వడదెబ్బ. కొందరికి 106 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరగొచ్చు. దీంతో చర్మం పొడిబారుతుంది. ముట్టుకుంటే శరీరం కాలిపోతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటూ పడిపోతుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే మాంసకృత్తులు, ఫాస్ఫోలిపిడ్లు కరిగిపోవచ్చు. దీంతో మెదడు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినటం మొదలవుతుంది. క్రమంగా అవయవాలు విఫలమై కోమాలోకీ వెళ్లిపోవచ్చు. ఫిట్స్‌ రావచ్చు. పరిస్థితి మరీ విషమిస్తే ప్రాణాపాయమూ సంభవించొచ్చు.

ఎండలోకి వెళ్తేనే కాదు.. వేడి గాలి, వేడి వాతావరణం ప్రభావంతో ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగలొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఇలాంటిది చూస్తుంటాం. వీరికి దాహం వేస్తున్న విషయం అంతగా తెలియదు. అందువల్ల నీరు తగినంత తాగరు. వీరిలో స్వేదగ్రంథులు తక్కువగా ఉండటం వల్ల చెమట అంత ఎక్కువగా పట్టదు కూడా. వయసు మీద పడ్డవారిలో చాలామంది అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ జబ్బులు, మానసిక సమస్యలకు మందులు వేసుకుంటుంటారు కూడా. ఇలాంటి మందులతోనూ వడదెబ్బ ముప్పు పెరగొచ్చు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారికీ దీని ముప్పు ఎక్కువే. ఇలాంటి చోట్ల చెమట బాగానే పోస్తుంది గానీ త్వరగా ఆవిరి కాదు. దీంతో ఒళ్లు చల్లబడదు.

చల్లబరచటం ప్రధానం:వడదెబ్బ తగిలినవారికి ముందుగా కావాల్సింది శరీరం చల్లబడేలా చూడటం. ఎండలో ఉన్నట్టయితే వెంటనే నీడకు చేర్చాలి. వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టాలి. బిగుతైన దుస్తులు.. టెర్లిన్‌, పాలిస్టర్‌ దుస్తులు ధరిస్తే తొలగించాలి. వదులైన, కాటన్‌ దుస్తులు వేయాలి. తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. శరీరం మీద నీళ్లు గుమ్మరించి ఫ్యాన్‌ గాలి తగిలేలా చూడాలి. వీలుంటే ఐస్‌ ముక్కలను ప్లాస్టిక్‌ బ్యాగులో వేసి ఒళ్లంతా తడమాలి. చంకల్లో, గజ్జల్లో తడి గుడ్డ గానీ ఐస్‌ ముక్కలు గానీ పెట్టినా మంచిదే. తాగగలిగే స్థితిలో ఉంటే లవణాలు, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీరు తాగించాలి. మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ, నీళ్లు అయినా ఇవ్వచ్చు. కొబ్బరి నీళ్లూ ఇవ్వచ్చు. అయితే ఒళ్లు కాలిపోతోందని ఎట్టి పరిస్థితుల్లోనూ పారాసిటమాల్‌, ఐబూప్రొఫెన్‌ వంటి మందులు ఇవ్వకూడదు. వడదెబ్బలో ఇవి ఉష్ణోగ్రతను తగ్గించవు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతుంటే, జ్వరం అంతకంతకూ పెరుగుతుంటే 108కు ఫోన్‌ చేసి ఆసుపత్రిలో చేర్పించాలి.

అత్యవసర చికిత్స:వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సత్వర చికిత్స అవసరం. ఆసుపత్రిలో ఐస్‌బాత్‌ చేయించటం, రక్తనాళం ద్వారా సెలైన్‌ ఎక్కించటం వంటి వాటి ద్వారా శరీర ఉష్ణోగ్రత చల్లబడేలా చేస్తారు. సెలైన్‌తో రక్తం పరిమాణం పెరిగి, రక్తపోటు మెరుగవుతుంది. చర్మానికి తగినంత రక్తం సరఫరా అవుతుంది. చెమట పట్టటం మొదలవుతుంది. అపస్మారక స్థితిలో ఉండి, శ్వాస సరిగా తీసుకోకపోతే కృత్రిమ శ్వాస కల్పించి, చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:యాదాద్రి ఉద్ఘాటనా పర్వం పరిసమాప్తం.. పులకించిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details