వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ Gang Rape on Girl: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలిక(17)పై అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి రకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్(18)ను అరెస్టు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మరో నిందితుడిని రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈనెల 31వ తేదీ రాత్రి బాలిక తండ్రి స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. 28వ తేదీ జరిగిన పార్టీకి వారి బాలిక వెళ్లిందని.. ఆ తర్వాత షాక్‌లోకి వెళ్లిందని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
పాపపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసిన బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మరుసటి రోజు పాపను భరోసా కేంద్రానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ చేసి వివరాలు తెలుసుకున్నామన్నారు. భరోసా కేంద్రం అధికారులు వివరాలు సేకరించి తమకు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత అంతకు ముందు నమోదు చేసిన కేసుతో పాటు అత్యాచారం, పోక్సో చట్టం కింద మరిన్ని సెక్షన్లు కలిపి కేసు నమోదు చేశామన్నారు. ఎవరెవరు దాడికి పాల్పడ్డారనే వారి పేర్లు బాధితురాలు చెప్పలేకపోయిందన్నారు. ఒక నిందితుడి పేరు మాత్రం చెప్పిందన్న డీసీపీ.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
"సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సేకరించాం. సీడీఆర్ ఎనాలసిస్ చేసి... బాలిక చెప్పిన వివరాలతో సీసీటీవీ ఫుటేజీని పోల్చుకుని ఐదుగురు నిందితులను గుర్తించాం. ఇందులో ముగ్గురు 16.. 17ఏళ్లలోపు వారే. వారిలో సాదుద్దీన్ మాలిక్(18)ని అరెస్టు చేశాం. రాత్రిపూట మైనర్‌ను చట్ట ప్రకారం పట్టుకోకూడదు. 18 ఏళ్లు నిండిన ఉమేర్‌ఖాన్, మిగతా ముగ్గురు మైనర్ల పేర్లు చట్ట ప్రకారం వెల్లడించకూడదు.మరో 48 గంటల్లో మిగతా వారిని కూడా అరెస్టు చేస్తాం. సాంకేతిక ఆధారాలు సేకరించాం. బాధితురాలు కోలుకున్న తర్వాత 164 స్టేట్‌మెంట్ తీసుకుని, ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉన్నా వారికి శిక్షపడేలా చూస్తాం. హోం మంత్రి మనువడు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. బాలిక ఫిర్యాదు ఆధారంగా అన్ని ప్రాంతాల్లో మినిట్ టు మినిట్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత హోం మంత్రి మనువడు ఉన్నారని ప్రచారం చేయడం దారుణం. వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధితురాలి ఫొటో, పేర్లు ప్రచురించిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటాం. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఉన్నట్టు కచ్చితమైన సమాచారం. (జువైనల్ యాక్టు ప్రకారం పేరు చెప్పకూడదు.) ఇప్పటివరకు ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్టు ఆధారాలు లభ్యం కాలేదు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించి.. ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా అరెస్టు చేస్తాం. పబ్‌లోకి పార్టీ ఉందని బాలికను తీసుకెళ్లారు. పబ్‌లో పార్టీపై ఇంకా దర్యాప్తు చేయలేదు. పబ్‌లో నిబంధనలు అతిక్రమించి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని బాలిక చెప్పలేదు. సీసీ టీవీ ఫుటేజీలో కూడా ఆధారాలు లభించలేదు. నిందితులతో బాలికకు ఇంతకుముందు పరిచయం లేదు. అందుకే వారి పేర్లు కచ్చితంగా చెప్పలేకపోతోంది" -జోయల్ డేవిస్, వెస్ట్ జోన్ డీసీపీ
ఇవీ చదవండి: