ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 10:31 AM IST

ETV Bharat / city

మావోయిస్టు నేత భాస్కర్‌ డైరీలో కీలక సమాచారం

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ డైరీలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. కడంబా అడవుల్లో సెప్టెంబరు 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దళసభ్యులు మృతిచెందగా.. భాస్కర్‌ త్రుటిలో తప్పించుకున్నాడు.

POLICE GOT MAOIST LEADER BHASKARS DAIRY AND FOUND IMPORTANT INFORMATION
మావోయిస్టు నేత భాస్కర్‌ డైరీలో కీలక సమాచారం

గత మార్చి నుంచి అక్టోబరు వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంగి అటవీ ప్రాంతంలో సంచరించిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ దళాన్ని నిలువరించేందుకు గ్రేహౌండ్స్‌, టీఎస్‌ఎస్‌పీ, పోలీసు బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో కడంబా అడవుల్లో సెప్టెంబరు 19న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దళసభ్యులు మృతిచెందారు. భాస్కర్‌ త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం ఓ దళసభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న భాస్కర్‌ డైరీలో కీలక సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. ‘గత జూన్‌ నుంచి అక్టోబరు వరకు మన వాళ్లపై అయిదుసార్లు దాడి తప్పింది. కాండ్లమడుగులో సెప్టెంబరు 23న అంబుష్‌ నుంచి తప్పించుకున్నాం. పార్టీకి సహకరించేందుకు ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు సమస్యలున్నా పోరాడే పరిస్థితి లేదు. మెజారిటీ ప్రజలకు కొత్త భూములు దొరకడం.. మూడు పంటలు పండటం.. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండటంతో పార్టీ అవసరం అంతగా లేదు’ అని డైరీలో భాస్కర్‌ రాసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగింపు

మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలైన రాడికల్‌ యూత్‌ లీగ్‌, రైతు కూలీ సంఘం, రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య (వికాస), ఆల్‌ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌లపై గత ఆగస్టు 17 నుంచి, రివల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్‌డీఎఫ్‌)పై ఆగస్టు 9 నుంచి ఏడాది కాలం పాటు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

ఇదీ చదవండి:

విశాఖలో దారుణం...ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details