ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు.. పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.... అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలిక చరవాణి ఉపయోగించినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూకట్పల్లిలోని లోధ అపార్ట్మెంట్ వరకు అఖిలప్రియ రెండు చరవాణిల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు పోలీసులు తేల్చారు.
ఫోన్ను విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు..
అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె ఉపయోగించిన రెండు చరవాణిలు ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ ఇళ్లకు తాళం వేసి ఉంది. న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంటి తాళం తీసి... చరవాణిలు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.