పరీక్షల్లో చూచిరాతకు పాల్పడితే నేరం. కానీ, ఇక నుంచి ఎంచక్కా పుస్తకాలు దగ్గర పెట్టుకొని మరీ పరీక్షలు రాయొచ్చు. ఇప్పటివరకు చర్చలకే పరిమితమైన ఓపెన్ బుక్ పరీక్షల విధానాన్నితెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచే అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్) కీలక నిర్ణయం తీసుకుంది.
సబ్జెక్టుపై పట్టు తప్పనిసరి
ఓపెన్ బుక్ పరీక్షల విధానంలో సబ్జెక్టుపై పట్టు ఉంటేనే పరీక్షలు బాగా రాయగలుగుతారు. భావనల (కాన్సెప్ట్)పై అవగాహన తప్పనిసరి. ప్రయోగ (ప్రాక్టికల్) పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. కొత్త విధానాన్ని అమలు చేయాలంటే ప్రశ్నపత్రాలు, బోధన తీరు కూడా మారాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఎలా వచ్చినా జవాబులు రాసేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలి. దేశంలో పరీక్షల విధానంలో మార్పులు చేయాలనే ఆలోచనలో ఇప్పటికే దేశంలోని అన్ని యూనివర్సిటీలు సంస్కరణలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారి పరీక్షల విధానంలో మార్పుల కోసం ఇప్పటికే కృషి జరుగుతోంది.
ఓపెన్ బుక్ టెస్ట్‌లకే ప్రాధాన్యం
తాజాగా కరోనా విజృంభణతో పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, సెమిస్టర్ తరగతులను మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న ఈ సమయంలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో పలు యూనివర్సిటీలు ఓపెన్ బుక్ టెస్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, కొన్ని ఆన్‌లైన్ ద్వారా ఓపెన్ బుక్ పరీక్షలను అనుమతిస్తుండంగా మరికొన్ని మాత్రం పరీక్షా కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈ విధానం అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో అమలుచేస్తున్నారు. ఏఐసీటీఈ, యూజీసీ సైతం పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో పెట్టుకోవచ్చని, అది ఆయా వర్సిటీల ఇష్టమని స్పష్టంచేశాయి.
కొన్ని సబ్జెక్టుల్లోనే..
తెలంగాణ రాష్ట్రంలో 54 ప్రభుత్వ, 77 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏటా సుమారు 25 వేల మంది చేరుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ (సీ21)తో పాటు ఓపెన్ బుక్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. కోర్సుల వారీగా నియమించిన కమిటీల సిఫారసులను బట్టి అమలు చేస్తారు. కోర్సుకు ఒకటీ రెండు సబ్జెక్టులకు అమలు చేసే అవకాశముందని ఎస్‌బీటెట్ కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు.ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతికి నిర్వహించే పరీక్ష) ఇప్పటికే ఓపెన్ బుక్ విధానంలో జరుగుతోందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈ పద్ధతిని ఇంజినీరింగ్‌తోపాటు డిగ్రీలోనూ కొన్ని సబ్జెక్టుల్లో అమలుకు కొంతకాలంగా అధ్యయనం చేస్తున్నామని, ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:స్టేజిపైనే వరుడు నిద్ర.. వధువు రియాక్షన్ చూస్తే...